Telangana : గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST)కి సంబంధించి ఉత్పన్నమవుతున్న సమస్యలను కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. చండీగఢ్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరిగిన 47వ జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్ బుధవారం జూన్ 29తో ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యల వల్ల తెలంగాణ ఆర్థికంగా నష్టపోతోందని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు హరీశ్ రావు. "తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నాయి. టాక్స్ కడుతున్న వారి అడ్రస్ ఇంకా అప్ డేట్ కాలేదు. చాలామంది పన్ను చెల్లింపుదారుల అడ్రస్ ఇంకా ఆంధ్రప్రదేశ్ పేరుతోనే కొనసాగుతోంది. దీని కారణంగా.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన భారీ పన్ను ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోతోంది" అని హరీశ్ రావు .. నిర్మల సీతారామన్ కు వివరించారు.
పన్ను చెల్లింపు దారులు తెలంగాణ రాష్ట్రం పరిధిలోనే ఉంటున్నప్పటికీ.. వారు చెల్లించే ఆదాయం ఆంధ్రప్రదేశ్ కు పోతోందన్నారు హరీశ్ రావు. గతంలో స్థాపించిన సంస్థలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వ్యాపార సముదాయాల అడ్రస్ ఏపీ అని ఉందన్నారు. ప్రధానంగా.. జీఎస్టీ రికార్డుల్లో కూడా ఈ అడ్రస్ అప్ డేట్ కాకపోవడం వల్ల తెలంగాణకు వచ్చే ఆదాయం భారీస్థాయిలో ఆంధ్రాకు వెళ్లిపోతోందని కేంద్రానికి వివరించి చెప్పారు హరీశ్ రావు.
Read Also : Eatala Rajender : ఈటల రాజేందర్‌కు భారీ షాక్.. ఆ భూములు పంచేశారు!
తెలంగాణకు అన్యాయం జరగకుండా ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరింది తెలంగాణ ఆర్థిక శాఖ. జీఎస్టీ రిటన్ 3-బీ ఫారంలో అడ్రస్ కన్ఫర్మేషన్ ఫెసిలిటీ కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ఇప్పటివరకు మళ్లించిన ఐజీఎస్టీని రికవరీ చేయడానికి.. పన్ను చెల్లింపుదారుల పరిధి నిర్ణయించే విషయంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ అధికారుల సహకారం అందేలా చూడాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GST, GST Council, Harish Rao, Nirmala sitharaman