సోషల్ మీడియాలో వేధింపులకు గురయ్యే మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి అలాంటి వారిపై ఫిర్యాదు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ట్రూ కాలర్, నెట్వర్క్18 ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక మాధ్యమాల్లో మహిళలు వేధింపులపై గళమెత్తడం అనే అంశంపై జాతీయస్థాయి అవగాహన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సోషల్ మీడియాకు(Social Media) అంత అలవాటు పడిపోయిన ప్రస్తుతం యుగంలో.. దాని నుంచి సేఫ్‌గా ఉండటం కూడా ముఖ్యమే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సొంతంగా సైబర్ క్రైమ్ చట్టాన్ని రూపొందించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ(Telangana) నిలిచిందని కేటీఆర్ (KTR) తెలిపారు.
ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ దిక్సూచిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముఖ్యమే కానీ.. అదే సమయంలో ఇతరులను కించపరిచడం కూడా సరికాదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా ఓ హద్దు ఉండాలని అన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులను సీరియస్‌గా తీసుకున్నామని అన్నారు. ఈ విషయంలో మహిళలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని.ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం చేయబోతున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఈ విషయంలో ప్రజలను కాపాడేందుకు అనేక చట్టాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో మహిళలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని.. అందులో భాగంగానే షీ టీమ్స్ తీసుకొచ్చామని తెలిపారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్లో ఇబ్బందిపడే మహిళల సమస్యల పరిష్కరించేందుకు షీ టీమ్స్ సమర్థవంతంగా పని చేస్తున్నాయని అన్నారు. సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులతో పాటు సైబర్ సెక్యూరిటీ అనేది పెద్ద సవాల్‌గా మారిందని కేటీఆర్ అన్నారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో సమర్థవంతంగా ముందుకు సాగుతున్న ఇజ్రాయిల్‌తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ ద్వారా ఉపాధి కల్పనతో పాటు భద్రత పెంచుకునే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొనే మహిళల కోసం రాష్ట్ర హోంమంత్రితో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. డిజిటల్ విషయంలో సేఫ్‌గా ఉండే అంశాన్ని అంతా నేర్చుకోవాలని.. ఈ విషయంలో మోసపోవడానికి ముందే మేల్కోవాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రూ కాలర్, నెట్వర్క్18 నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.