Home /News /telangana /

GRANITE INDUSTRY CRORES OF RUPEES LOSSES DUE TO CORONA PANDEMIC VRY KMM

Khammam : కష్టాల్లో గ్రానైట్‌ ఇండస్ట్రీ.. రూ.1500 కోట్ల నష్టం.. కుదేలైన పరిశ్రమ..కష్టాల్లో గ్రానైట్‌ ఇండస్ట్రీ.. రూ.1500 కోట్ల నష్టం.. కుదేలైన పరిశ్రమ..

కష్టాల్లో గ్రానైట్‌ ఇండస్ట్రీ.. రూ.1500 కోట్ల నష్టం.. కుదేలైన పరిశ్రమ..

Khammam :కోవిడ్‌-19 కరోనా వైరస్‌ అన్ని రంగాలను కమ్మేస్తోంది. దాదాపు ఏడాదికి పైగా కరోనా వైరస్‌ ధాటికి అన్ని సెక్టార్లు విలవిలాడుతుండగా, మైనింగ్‌ రంగంలో ప్రధాన వనరు అయిన గ్రానైట్‌ పరిశ్రమ తలకిందులైపోతోంది. ఈ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు, ట్రేడర్లు అందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కావడం.. దేశీయ వినియోగంతో పాటుగా, విదేశాలకు ఇక్కడి నుంచి గ్రానైట్‌ పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుండడంతో కరోనా ఎఫెక్ట్‌ తీవ్రంగా ఈ రంగాన్ని తాకింది.

ఇంకా చదవండి ...
జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు,ఖమ్మం జిల్లా

ఏటా ఖమ్మం జిల్లాకు గ్రానైట్‌ పరిశ్రమ ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల ద్వారా సుమారు రూ.1500 నుంచి 2000 కోట్ల దాకా ఆదాయం సమకూరుతుండే పరిస్థితి. ఇక్కడ గ్రానైట్‌ శ్లాబ్‌, టైల్స్‌ రెండు కలిపి సుమారు వెయ్యి దాకా పరిశ్రమలున్నాయి. వీటన్నిటిలో రెండువేలకు పైగా ఉన్న కట్టర్లు నెలకు సుమారు రెండు కోట్ల చదరపు అడుగుల గ్రానైట్‌ను కటింగ్‌, పాలిషింగ్‌ చేసి ఫినిష్డ్‌ ప్రొడక్ట్‌గా విదేశాలకు, దేశీయంగానూ ఎగుమతి చేస్తున్న పరిస్థితి. ఒక్కో ఫ్యాక్టరీకి నెలకు రెండు నుంచి మూడు లక్షల విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తుంటారు. ఒక్కో ఫ్యాక్టీరిలో సగటున 25 మంది కార్మికులు ఉండాల్సిందే.

అయితే గతేడాది మార్చిలో మొదలైన లాక్‌డౌన్ ప్రభావం ఇప్పటికీ వెన్నాడుతునే ఉంది. ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా పరిశ్రమలు మూతపడ్డ పరిస్థితి ఉంది. ఆక్సిజన్‌ లేకపోవడం.. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఇళ్లకు వెళ్లిపోవడం.. ఉత్పత్తి లేక.. ఎగుమతులు లేక.. మినిమం ఖర్చులు సైతం రాక గ్రానైట్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇప్పటికే విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదన్న కారణంగా 220 ఫ్యాక్టరీలకు డిస్కనెక్షన్‌ చేస్తామంటూ ఎన్పీడీసీఎల్‌ సంస్థ నోటీసులు సైతం జారీ చేసింది.ఉమ్మడి ఖమ్మంతో పాటు ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు గ్రానైట్‌ నిల్వలకు పెట్టింది పేరు. బ్లాక్‌ గ్రానైట్‌తో పాటుగా ఇంకా అనేక రకాల కలర్లు, షేడ్స్ ఈ ప్రాంతం సొంతం. అలా ఓ వెలుగు వెలిగిన గ్రానైట్ పరిశ్రమ ఇప్పుడు ఒక్కసారిగా ఢీలా పడింది. ఇక్కడి నుంచి నేరుగా దాదాపు 15కు పైగా దేశాలకు కళ్లు జిగేల్‌ మనిపించే గ్రానైట్ ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. గతంలో లక్షలాది మంది కార్మికులు ఈ సెక్టార్‌లో నైపుణ్య కార్మికులుగా, సాధారణ కార్మికులుగా పనిచేస్తుండేవాళ్లు. కానీ ఇప్పుడీ పరిశ్రమ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించినా ఫలించని నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు ఏభైశాతం పరిశ్రమలు మూతబడ్డాయి.

కరోనా ఉధృతికి తోడు ప్రభుత్వాల సహకారం లోపించడం కూడా దీనికి తోడైంది. కోవిడ్ దెబ్బకు కార్మికులు, బయ్యర్లు స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీనికితోడు ఫ్యాక్టరీల్లో పెద్దపెద్ద బ్లాకుల కటింగ్‌ పనులకు ఆక్సిజన్ అవసరం ఉంటుంది. కరోనా సెకండ్ వేవ్లో అధికంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ వినియోగం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ లకు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మరోవైపు కరెంట్ బిల్లులు, బ్యాంకు కిస్తీలు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వాలూ శ్రద్ధ పెట్టకపోవడంతో ఒకప్పుడు పేరుమోసిన గ్రానైట్ వ్యాపారులు సైతం ఇప్పుడు ఫ్యాక్టరీలు మూసివేశారు.

కరోనా ఫస్ట్‌ వేవ్‌ నాటికే దాదాపు ఢీలా పడిన పరిశ్రమ సెకండ్ వేవ్‌ తో మరింత నష్టాల్లోకి వెళ్లింది. ఇప్పటికే 50శాతం పరిశ్రమలు మూతపడగా మరి కొన్ని కూడా మూసివేత దిశగా పయనిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 450 స్లాబ్, 120 టైల్స్ పరిశ్రమలు న్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో రాజస్థాన్, బీహార్, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు ప్రస్తుతం పనిచేస్తున్నారు.

వృత్తి నైపుణ్యం లేకపోవడం, గ్రానైట్ వ్యర్థాలతో ఆరోగ్యానికి ముప్పు అనే భావనతో స్థానిక కార్మికులు ఈ ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూపరు . కాబట్టి వలస కార్మికులు ఆయా ప్రదేశాల్లో తాత్కాలికంగా నిర్మించిన షెడ్లలో ఉంటూ ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో వీరిలో చాలా మంది స్వస్థలాలకు వెళ్లారు. అందులో కొద్దిమంది తిరిగి వచ్చారు. ఆ అరకొర కార్మికులతోనే ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సెకండ్ వేవ్ రావడంతో మరికొందరు కార్మికులు తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇటు కార్మికులతో పాటు బయ్యర్లు కూడా ఆయా రాష్ట్రాలకే చెందిన వారు కావడంతో గతేడాది కాలంగా కొనుగోళ్లు పూర్తిగా మందగించాయి.

దేశీయ, విదేశీ అవసరాలకు స్లాబ్, టైల్స్ తయారు చేయడం వలస కార్మికులపైనే ఆధారపడి ఉంటుంది. అటు కార్మికులు లేకపోవడం ఇటు ఖమ్మం కేంద్రంగా గ్రానైట్ ఉత్పత్తులను ఎగుమతి చేసే సుమారు 150 మంది వ్యాపారులు కూడా రాష్టేతరులు కావడంతో వారూ కరోనాతో స్వరాష్ట్రాలకు వెళ్లారు. స్థానికంగా కార్మికులు లభ్యమైన చోట, వలస కార్మికులు ఉన్న కొన్ని పరిశ్రమల్లోనే గ్రానైట్ ఉత్పత్తి, ఎగుమతులు జరుగుతున్నాయి.

మరోవైపు కరెంట్ బిల్లులు, బ్యాంకు కిస్తీలు, రాయల్టీ వీటికి భారంగా మారాయి. ఈ విష యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలివ్వాలని గ్రానైట్ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై గ్రానైట్ వ్యాపారుల సంఘం రాష్ట్ర నాయకులు సాధు రమేష్‌రెడ్డి 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ గతేడాదికి పైగా గ్రానైట్‌ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని గ్రానైట్‌ పరిశ్రమలకు ప్రకటించిన రాయితీలను విడుదల చేయాలని, అలాగే విద్యుత్‌ బిల్లుల విషయంలో సంయమనం పాటించాలని కోరుతున్నామన్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Khammam, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు