Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: September 7, 2019, 7:12 AM IST
నరసింహన్, సౌందరరాజన్
తెలంగాణ గవర్నర్ నరసింహన్... తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవలు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయేటప్పుడు... రాష్ట్రపతి పాలన రాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు తెలుగు రాష్ట్రాలకు కలిసొచ్చాయి. ఈ క్రమంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణకు కొత్త గవర్నర్గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళ ఇసై సౌందరరాజన్ మొన్ననే నియమితులయ్యారు. ఈ నెల 8న అంటే ఆదివారం ఆమె బాధ్యతలు తీసుకోబోతున్నారు. అందుకే ఇవాళ గవర్నర్కు ఘనంగా వీడ్కోలు చెప్పబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగబోతోంది. దీనికి సీఎం కేసీఆర్, మంత్రులు హాజరుకాబోతున్నారు. ఈ కార్యక్రమం తర్వాత గవర్నర్ 7 గంటలకు చెన్నై బయలుదేరతారు.
తమిళ ఇసై సౌందరరాజన్... ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ గవర్నర్గా ప్రమాణస్వీకారం చేస్తారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్... రాజ్భవన్లో ఈ ప్రమాణం చేయిస్తారు. ఆ కార్యక్రమానికి కూడా సంప్రదాయం ప్రకారం సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు హాజరవుతారు. అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
నరసింహన్ ఏమన్నారంటే : విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు తొలి గవర్నర్గా కొనసాగిన నరసింహన్ ఇటీవల తన అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే, పరిస్థితి అదుపు తప్పనీయకుండా వ్యవహరించారని నరసింహన్ గుర్తు చేసుకున్నారు. భాష్పవాయు గోళాలు, వాటర్ కేనాన్స్ వంటి తక్కువ హాని కలగించే సాధనాలతోనే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్ర విభజన సమయంలో తనను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమంటూ మీడియా సృష్టించిందని నరసింహన్ పేర్కొన్నారు. ఉద్యమసమయంలో పోలీసు అద్భుతంగా పనిచేశారని, అదుపు తప్పకుండా సంయమనంతో మెలిగారని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతతో మెలిగాయని, లేకపోతే పరిస్థితి అదుపుతప్పేదని నరసింహన్ అభిప్రాయపడ్డారు.
శేషజీవితం చెన్నైలోనే : గవర్నర్గా పదవీ విమరణ చేసిన తరువాత చెన్నైలోనే ఉంటానని నరసింహన్ స్పష్టం చేశారు. వడ, సాంబారు తింటూ కాలక్షేపం చేస్తానని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తనకు రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని చెప్పిన నరసింహన్... రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. తన పదేళ్ల పదవీ కాలంలో తనపై వచ్చిన ఆరోపణలపై కూడా నరసింహన్ స్పందించారు. తాను గుళ్లు, గోపురాలు తిరుగుతాననే వార్తలపై స్పందించిన నరసింహన్... అది పూర్తిగా వ్యక్తిగత జీవితమని వ్యాఖ్యానించారు. తనను కొందరు పూజారిగా అభివర్ణించారని...అంతకంటే భాగ్యం మరేముంటుందని ఛలోక్తులు విసిరారు.
Published by:
Krishna Kumar N
First published:
September 7, 2019, 5:46 AM IST