Governor Tamilisai Soundararajan: TSPSC పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. పేపర్ లీక్ తో ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేయగా..దర్యాప్తు బాధ్యతలను సిట్ చేతికిచ్చారు. ఇక ఈ కేసులో తవ్వినా కొద్ది కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పేపర్ లీక్ వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. TSPSCలో పని చేస్తూ ఉద్యోగాలు రాసిన సిబ్బంది, అలాగే రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు, అలాగే వారి మార్కులతో పాటు అన్ని వివరాలు నివేదికలో పొందుపరచాలని పేర్కొన్నారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీ అంశంపై తనను కలిసిన కాంగ్రెస్ నేతలతో ఇటీవల గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై అన్నింటిని పరిశీలిస్తున్నట్టు వారికి తెలిపారు. ఈ విషయంలో రాజ్యాంగ బాధ్యతలకు లోబడే పని చేస్తానని ఆమె తెలిపారు. కాంగ్రెస్(Congress) నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడున్న టీఏస్‌పీఏస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అందరినీ సస్పెండ్ చేసి.. పారదర్శక విచారణ చేస్తారని భావించామని.. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉందన్నారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని విమర్శించారు.
కేటీఆర్ , జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు అప్లికేషన్ ఇచ్చామన్నారు. దీనిపై లీగల్ ఓపినీయన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరి గవర్నర్ ఆదేశాలపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.