హోమ్ /వార్తలు /తెలంగాణ /

ST reservation: ఎస్టీలకు శుభవార్త.. నేటి నుంచే 10శాతం రిజర్వేషన్‌లు.. అర్థరాత్రి సర్కార్ ఉత్తర్వులు

ST reservation: ఎస్టీలకు శుభవార్త.. నేటి నుంచే 10శాతం రిజర్వేషన్‌లు.. అర్థరాత్రి సర్కార్ ఉత్తర్వులు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ST Reservations: విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జీవో విడుదలైన వెంటనే సంబరాలు మొదలయ్యాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్టీ రిజర్వేషన్స్  (ST Reservations) జీవో వచ్చేసింది. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్‌లను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangaan Govt) శుక్రవారం అర్థరాత్రి దాటాక ఉత్తర్వులు (జీవో నెం.33) జారీ చేసింది. తక్షణ ఇది అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. చెల్లప్ప కమిషన్ సిఫారసుల మేరకు.. రాష్ట్రంలోని గిరిజనుల స్థితిగతులను పరిగణలోకి తీసుకొని.. గిరిజనుల రిజర్వేషన్‌లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ (CM KCR).. తిరిగి ప్రగతి భవన్‌కు వచ్చిన వెంటనే గిరిజన రిజర్వేషన్‌లపై సమీక్ష నిర్వహించి.. ఆమోదం తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జీవో విడుదల చేశారు. నేటి నుంచి విద్యా,  ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.

  Traffic Rules: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇకపై ఇలా చేస్తే జరిమానాలు

  తాజా ఉత్తర్వులతో తెలంగాణలో విద్య , ప్రభుత్వ ఉద్యోగా నియామకాల్లో మొత్తం రిజర్వేషన్‌లు 64 శాతానికి చేరాయి. బీసీలు 29 శాతం (బీసీ ఏ-7, బీసీ బీ-10, బీసీ సీ-1, బీసీ డీ-7, బీసీ ఈ-4), ఎస్పీలు 15శాతం, ఎస్టీలు 10శాతం, ఈడబ్ల్యూఎస్ 10శాతంగా ఉన్నాయి. ఇవి కాకుండా క్రీడలు 2 శాతం, వికలాంగుల కోటా 4 శాతంగా ఉంది.

  తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్బంగా సెప్టెంబర్‌ 17న ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో గిరిజన రిజర్వేషన్‌లపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గిరిజనుల రిజర్వేషన్‌లను 6శాతం నుంచి 10శాతానికి పెంచుతున్నామని.. వారం రోజుల్లోనే జీవో విడుదల చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావా? లేక దానితో ఉరి వేసుకుంటావా ఆలోచించుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ హామీ ఇచ్చి ఇప్పటికే వారం రోజులు గడవడంతో.. శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులను జారీచేశారు.

  విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జీవో విడుదలైన వెంటనే సంబరాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆధ్వర్యంలో గిరిజన నాయకులు, ఆదివాసీలు బాణాసంచా కాల్చారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బంజారా, ఆదివాసీ భవనాల్లో కూడా సందడి వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Hyderabad, ST Reservations, Telangana

  ఉత్తమ కథలు