ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ, ఉపాధ్యాయ విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్‌ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంప్లాయస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వం ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములగా చేస్తుంది. దీనికి సంబంధించిన విధి, విధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. తెలంగాణ బడ్జెట్ సందర్భంగా ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరిశ్‌రావు స్పష్టం చేశారు.
ఫలించిన ఉద్యోగుల కల:
నిజానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఒక శాతం చందాతో ఆరోగ్యపథకాన్ని (ఈహెచ్‌ఎస్) అమలుచేయాలని టీఎన్జీవో, పీఆర్టీయూటీఎస్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పూర్తిగా నగదు రహిత విధానంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశాయి. గత నెల 23న ఆయా సంఘాల నేతలు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు, హెల్త్ సెక్రటరీ రిజ్వీని వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఆరోగ్యపథకం అమలు కోసం ఉద్యోగుల మూలవేతనంలో ఒకశాతం చందా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సైతం తన వాటాగా ట్రస్ట్‌కు ఒకశాతం చందాను చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించినట్టు అప్పట్లోనే వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాలు కూడా గతంలో చెప్పాయి. ఇక ఊహించినట్లుగానే బడ్జెట్‌లో హరిశ్‌రావు ఉద్యోగుల విజ్ఙప్తిని అంగీకరిస్తూ ఈ ఆర్ధిక సంవత్సరం నుంచే కొత్త ఈహెచ్‌ఎస్‌ను అమలు చేస్తామని చెప్పారు.
ఎన్నికలకు ముందు గొప్ప వరం:
తెలంగాణ వచ్చాక ఉద్యోగులందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తామని కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. అయితే తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఎనిమిదేళ్లుగా అమలుపరుస్తున్న ఈ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లో మార్పులు చేయాలని ఉద్యోగులు,ఉపాధ్యయులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు వారి కుంటుంబ సభ్యులు కలిపి 15 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ ఆరోగ్య కార్డుల ద్వారా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించుటకు ప్రభుత్వానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మూల వేతనంలో ఒక శాతం సొమ్మును చందాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఈ మధ్య ఉద్యోగ సంఘాలు కూడా ప్రకటించాయి కూడా. ఇక ఏడాది చివరిలో ఎన్నికలు ఉండడం.. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యయ సంఘాలు కొత్త ఈహెచ్‌ఎస్‌పై అనేక సార్లు మంత్రులను కలవడంతో ప్రభుత్వం కూడా వారి విజ్ఙప్తికి అంగీకరించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget, Harishrao, Telangana Budget