భారీ వర్షాలు (Heavy Rains) పడే సమయంలో ఉరుములు మెరుపులతో పిడుగులు (Lightening Strike) పడుతుంటాయి. పిడుగు పడిన పరిసరాల్లో ఉన్న వ్యక్తులు గాని, మూగ జీవాలు గాని చనిపోవడం, లేకపోతే గాయాలపాలు కావడం చూస్తుంటాం. చెట్లు కూడా కాలిపోతుంటాయి. కానీ అందుకు భిన్నంగా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో అందరూ నివ్వెరపోయేలా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన ఓ మహిళను ఆసుపత్రిపాలు చేసింది. గతంలో ఎక్కడా కూడా ఇలాంటి సంఘటన జరిగిన దాఖలు కూడా లేవు. ఇంతకీ ఏమా సంఘటన..? ఆ మహిళ ఎందుకు ఆసుపత్రి పాలైంది? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత రెండు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి తోడు జిల్లాలో పలుచోట్ల పిడుగులు కూడా పడ్డాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా పొచ్చర గ్రామ సమీపంలోని దిమ్మ అనే గ్రామ శివారులో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పాటు భారీ పిడుగు పడింది. అదే సమయంలో సమీపంలోని పంట చేనులో శ్వేత అనే మహిళ వ్యవసాయ పనులు చేసుకుంటూ, ఆ పనుల్లో నిమగ్నమైంది. ఆ సమయంలో పిడుగు పడటంతో దాని వేడిమి దాటికి ఆ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కుపోయింది. ఆమెను గమనించిన స్థానికులు, తోటి కూలీలు వెంటనే 108 వాహనంలో ఆమెను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలిసింది.
Munugodu : మా ఇంటికి రావొద్దు .. మేం ఆ పార్టీకే ఓటేస్తామంటూ మునుగోడులో బోర్డులు
ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామంలోనూ పిడుగుపాటుతో తొమ్మిది మంది గాయపడ్డారు. పిప్పల్ కోటి గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహిళా కూలీలు గ్రామ శివారులోని పంట చేనులోకి వ్యవసాయ పనుల కోసం వెళ్ళారు. అదే సమయంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతోపాటు ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆరుగురు మహిళా కూలీలకు స్వల్ప గాయాలు కాగా, మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో గాయపడ్డవారిని చికిత్స కోసం వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు.
ఇక జిల్లాలోని గుడిహత్నూరు మండలం మల్కాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు 23 మేకలు మృతి చెందాయి. మల్కాపూర్ గ్రామానికి చెందిన గిరిజనుడు పెందూర్ రాము తన మేకలను మేపడానికి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకుపోయాడు. అదే సమయంలో పిడుగు పడటంతో మేతకు వెళ్ళిన మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన మేకల విలువ సుమారు మూడు లక్షల రూపాయలు. కాగా, మేకల కాపర్లకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Heavy Rains, Telangana