గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక.. ఆరేళ్ల తర్వాత..

భద్రాచలం వద్ద గోదావరి నది

భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో ఆరేళ్ల తర్వాత భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

 • Share this:
  తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో ఆరేళ్ల తర్వాత భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు నిండు కుండల్లా కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి, కృష్ణా నదులు సైతం మహోగ్రరూపం దాల్చాయి. భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలం వద్ద నీటి మట్టం 52 అడుగులు దాటింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర జలసంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రమాదకర స్థాయి దాటవచ్చని తెలిపింది. కానీ, అంతకుముందే ప్రమాదకర స్థాయి దాటింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. వరద బాధితులు సహాయం కోసం 040-423450624 నంబర్‌కు ఫోన్‌ చేయాలని పరిసర ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని తెలిపారు.

  తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం రెడ్ అలర్ట్ జారీచేసింది. ఐంఎండీ బులెటిన్ ప్రకారం.. భారీ వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వస్తుంది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలుతాయి. రోడ్లు తెగిపోయి వాహనాల రాకపోకలకు కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు పాటు అంతరాయం కలగవచ్చు. రిజర్వాయర్లు ఓవర్ ఫ్లో కావచ్చు. నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతాయి. పంట పొలాలను నీట మునుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించాలని అధికార యంత్రానికి సూచించింది. అన్ని జిల్లాల ప్రజలను అప్రమత్తం చేయాలని.. వరద నీటితో అంటు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపింది.

  ఆదిలాబాద్, కుమ్రం భీమ్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించంది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: