Home /News /telangana /

GO SADAK BANDH IN LB NAGAR MLA RAJA SINGH ARRESTED SU

Go Sadak Bandh: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. ఎల్‌బీ నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత

రాజాసింగ్ (ఫైల్ ఫోటో)

రాజాసింగ్ (ఫైల్ ఫోటో)

యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ చౌరస్తాలో శుక్రవారం గో సడక్ బంద్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వందలాది మంది గో సంరక్షులు ఎల్‌బీ నగర్‌కు తరలివచ్చేందుకు యత్నిస్తున్నారు.

    యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ చౌరస్తాలో శుక్రవారం గో సడక్ బంద్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వందలాది మంది గో సంరక్షులు ఎల్‌బీ నగర్‌కు తరలివచ్చేందుకు యత్నిస్తున్నారు. ఆవుల సంరక్షణ కోసం గో సడక్ బంద్ నిర్వహించనున్నట్లు ఇటీవల యుగతులసి ఫౌండేషన్‌ చైర్మన్‌, టీటీడీ పాలకమండలి సభ్యుడు కె శివకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నగరంలో వెంటనే అక్రమ వధశాలలను మూసివేయాలని, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గో సడక్ బంద్‌లో భాగంగా ఎల్‌బీ నగర్ చౌరస్తాను దిగ్భంధనం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ క్రమంలోనే గో సడక్ బంద్‌లో పాల్గొనేందుకు వందలాదిగా గో రక్షకులు, గో భక్తులు ఎల్‌బీ నగర్ చౌరస్తాకు బయలుదేరారు. దీంతో పోలీసులకు, గో రక్షకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

    ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్‌పేటలలో ముందస్తుగా గో భక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎల్‌బీ నగర్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనలతో ఎల్‌బీ నగర్ చౌరస్తాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గో సడక్ బంద్ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది.

    ఇక, గో సడక్ బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆయనను తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న గోవధను అరికట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ఈ అంశంపై స్పందించాలని కోరారు. మరోవైపు భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Cow protection, Hyderabad, Raja Singh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు