GO 402 ISSUE SETBACK TO KCR GOVT ON TEACHERS MUTUAL TRANSFERS ISSUE THE HIGH COURT SUSPENDS GO 402 MKS
GO 402: టీచర్ల మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ వివాదం.. జీవో 402ను సస్పెండ్ చేసిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టు
టీచర్ల బదిలీలకు సంబంధించి వివాదాస్పదంగా మారిన జీవో 402ని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంపై వివరణ సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
టీచర్ల బదిలీల వివాదంలో కేసీఆర్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. బదిలీలకు సంబంధించి వివాదాస్పదంగా మారిన జీవో 402ని హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో పరస్పర బదిలీలు (మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్) చేసుకునే ఉపాధ్యాయులు సీనియారిటీ కోల్పోకుండా బదిలీ అయ్యే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 402 అమలును న్యాయస్థానం నిలుపుదల చేసింది. జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం సోమవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణలో 33 కొత్త జిల్లాల ప్రకారం స్థానిక క్యాడర్ కేటాయింపులను పూర్తి చేసిన ప్రభుత్వం.. పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవో 402 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం జారీ అయిన నూతన ప్రెసిడెన్షియల్ రూల్స్ ప్రకారం.. పరస్పర బదిలీలు చేసుకునే ఉపాధ్యాయులు పాత జిల్లాల్లో తమకున్న సీనియారిటీని కోల్పోతారు. పరస్పర బదిలీ అనంతరం కొత్త జిల్లా క్యాడర్లో చివరి ర్యాంకు నుంచి మళ్లీ సీనియారిటీ మొదలవుతుంది. అయితే ఉపాధ్యాయులు ఇలా సీనియారిటీ కోల్పోకుండా పరస్పర బదిలీలు చేసుకునే అవకాశాన్ని ఈ జీవో కల్పిస్తుంది. అయితే,
జీవో 402 వల్ల తాము నష్టపోతామంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పలువురు సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... నూతన ప్రెసిడెన్షియల్ రూల్స్ ప్రకారం పరస్పర బదిలీలకు అవకాశం ఉందని, అయితే ఇలా చేసుకునేవారు పాత జిల్లాలో తమకున్న సీనియారిటీని కోల్పోయి కొత్త జిల్లా క్యాడర్లో చివరి ర్యాంకు నుంచి సర్వీసును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్ కీలక నిర్ణయాన్ని వెలువరించింది.
ప్రెసిడెన్షియల్ రూల్స్‌కు సవరణ తెస్తూ ప్రభుత్వం జీవో 402ను జారీచేసిందని... కానీ జీవో ద్వారా ప్రెసిడెన్షియల్ రూల్స్‌ను సవరించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. సీనియారిటీని కొనసాగించే అవకాశం ఇస్తే... కొత్త జిల్లాల్లో ఇప్పటికే ఉన్న తమకంటే పరస్పర బదిలీల ద్వారా వచ్చినవారు సీనియర్లు అవుతారని వాదించారు. దీనివల్ల తాము నష్టపోతామని తెలిపారు. ప్రభుత్వ జీవో 402కు ఎలాంటి ప్రాతిపదిక లేదని, దాన్ని కొట్టేయాలని కోరారు. పిటిషనర్ల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ఈ అంశంపై వివరణ సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదావేసింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.