Fake Remdesivir : నకిలీ రెమ్‌డెసివిర్‌..ప్రాణాలు కోల్పోయిన రోగి..విచారణలో అధికారులు

నకిలీ రెమ్‌డెసివిర్‌..ప్రాణాలు కోల్పోయిన రోగి..విచారణలో అధికారులు

Khammam :రెమ్‌డెసివిర్‌కు బదులుగా మరో మందును ఇచ్చిన ఘటన మరోసారి ఖమ్మంలో వెలుగులోకి వచ్చింది.అది కూడ ప్రభుత్వ దవాఖాన కావడం విశేషం.భాదితుడికి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వీడియో తీయడంతో సంఘటన వెలుగు చూసింది.దీంతో ఆసుపత్రిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు అధికారులు.

  • Share this:
ఖమ్మం జిల్లా

జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు కరస్పాండెంట్‌

ఓవైపు కరోనా వైరస్‌ రోజురోజుకూ విస్తరిస్తూ భయానక పరిస్థితులు సృష్టిస్తుండగా.. సరైన సమయంలో రోగులను ఆదుకోవాల్సిన వైద్యుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైరస్‌ పాజిటివ్‌ అనగానే వ్యాధిని అడ్డుపెట్టుకుని పేషంట్లను తీవ్రమైన భయానికి గురిచేస్తున్న ఘటనలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఇలాంటి ఘటనలు వెలుగుచూడగా.. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. అయినా ఎలాంటి మార్పు రాకపోగా.. కరోనా వైద్యం పేరిట దందా రకరకాల రూపాలు తీసుకుంటోంది.

ఖమ్మం పట్టణంలోని ఓ ప్రవేటు వైద్యశాలలో వెలుగుచూసిన రెమ్‌డెసీవర్ బ్లాక్ దందా శ్రుతిమించిన పరిస్థితికి అద్దం పడుతోంది. కరోనా పాజిటివ్‌ లక్షణాలతో ఇక్కడి చెస్ట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి.. రెమిడెసివర్‌ ఇంజెక్షన్‌ పేరిట ఒక్కోదానికి రూ.30 వేలు వసూలు చేయడమే కాకుండా.. రోగికి ఎక్కించినదీ నకిలీది కావడం దారుణంగా వ్యవహరించారు. అయితే ఐసీయూలో రోగికి రెమెడెసివర్‌ ఇంజెక్షన్‌ ఇస్తుండగా రోగి కుమారుడు బయట నుంచి సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించడంతో దారుణం వెలుగుచూసింది.

వాస్తవానికి హెటిరో కంపెనీ తయారుచేసిన రెమెడిసివర్‌ లిక్విడ్‌ రూపంలో ఉంటుంది.. కానీ ఇక్కడ ఈ ఆసుపత్రిలో రోగికి రెమ్‌డెసివర్ పేరిట ఎక్కించిన మందు మాత్రం పౌడర్‌ రూపంలో ఉండడంతో అనుమానం వచ్చి ఫిర్యాదు చేశారు. పిర్యాధు తర్వాత విచారణలో మరికొన్ని దారుణాలు వెలుగుచూడడం విశేషం. భద్రయ్య అనే పేషంట్‌కు ఇలా నకిలీ మందు ఎక్కించినట్టు.. దీంతోనే ఆ రోగి మృతిచెందినట్టు ఆయన కుమారుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. మృతుని కుమారుడు తీసిన వీడియోలో ఆసుపత్రి సిబ్బంది సెలైన్‌లో నుంచి సిరంజి ద్వారా కొంత లిక్విడ్‌ను తీసి.. పౌడర్‌ ఉన్న ఒక వాయిల్‌లో ఎక్కించినట్టు క్లియర్‌గా ఉంది.

దీంతో అసలు ఇప్పటిదాకా ఈ ఆసుపత్రిలో ఎంతమందికి చికిత్స చేశారు.. ఎన్ని రెమెడిసివర్‌ ఇంజెక్షన్లు వినియోగించారు. ఎంత వసూలు చేశారన్న దానిపై లోతుగా విచారణ జరుగుతోంది.

కోవిడ్‌-19 కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన పేషంట్లకు ఆక్సిజన్‌ శాచురేషన్‌ లెవల్‌ రాని పక్షంలో ప్రాణ రక్షణ కోసం డాక్టర్లు రెమెడిసివర్ ఇంజెక్షన్లను ఇస్తున్నారు. అయితే మొదట్లో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో లేక బ్లాక్‌లో ఒక్కోదానికి రూ.40 వేల నుంచి డెబ్భై వేల దాకా పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి. ఇలా ఇంజెక్షన్లు కొనుగోలు చేయలేక అనేకమంది రోగులు మృతిచెందిన ఘటనలు నమోదయ్యాయి.

దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఇంజెక్షన్‌ను తయారు చేస్తున్న కంపెనీ హెటెరో డ్రగ్స్‌ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపింది. స్వయంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల అవసరాలకు సరిపడా సరఫరా చేయాలని కోరడంతో ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతోబాటు హెటెరోడ్రగ్స్‌ అధినేత బండి పార్థసారధిరెడ్డి ఖమ్మం జిల్లా వాసి కావడం.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సాన్నిహిత్యం ఉండడంతో జిల్లాకు మరికొంత అలాట్‌మెంట్‌కు ఒప్పించారు. మొత్తంమీద వారానికి పదివేల డోసుల చొప్పున సప్లై చేసేందుకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఇలా సరఫరా అయిన ఇంజెక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రులతో బాటు, కోవిడ్‌ రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులకు కోటా పద్దతిలో రోజువారీగా ఇస్తున్నారు. దీనిపై ప్రీఆడిట్‌, పోస్ట్‌ ఆడిట్‌ సైతం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రవేటు ఆసుపత్రులలో డబ్బులకు కక్కుర్తి పడిన వైద్యులు, సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

వాస్తవానికి ఇలా సరఫరా మెరుగుపడక ముందు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాదాపు నాలుగు కేసుల్లో పలువురిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపింది. అయినా అక్రమార్కుల్లో మార్పు రావడం లేదు. రోగుల అత్యవసరం, బంధువుల ఆతృతను, భయాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు.

ఖమ్మం పట్టణానికి కూతవేటు దూరంలో ఉండే గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ భద్రయ్యకు కరోనా పాజిటివ్‌ రావడంతో గత నెల 24న ఖమ్మంలోని బాలాజీ ఛెస్ట్‌ ఆసుపత్రిలో చేర్చారు. కొద్ది రోజుల తర్వాత రెమెడెసివర్‌ ఇంజెక్షన్లు కావాలని ఆసుపత్రిలో చెప్పారని.. తాము ప్రయత్నించినా దొరకక పోవడంతో.. మీరే ఏర్పాటు చేయమని కోరగా.. ఒక్కోదానికి రూ.30 వేల చొప్పున రెండు ఇంజెక్షన్లకు రూ.60 వేలు వసూలు చేశారన్నారు. ఈ ఇంజెక్షన్‌ చేసే సందర్భంలో పొడి రూపంలో ఉండడంతో అదేంటి అని అడిగినా సమాధానం చెప్పలేదని.. మరసటి రోజు మరో రోగికి ఇదే ఇంజెక్షన్‌ ఇస్తుండగా తాను చూశానని.. అది మాత్రం లిక్విడ్‌ రూపంలోనే ఉండడంతో ప్రశ్నించానని.. అయినా సమాధానం చెప్పలేదని మృతుని కుమారుడు సందీప్‌ ఆరోపించారు. ఇలా నకిలీ ఇంజెక్షన్లు చేయడంతో తన తండ్రి ఆరోగ్యం విషమించడంతో.. మరోచోటికి మార్చాలని నిర్దాక్షిణ్యంగా చెప్పారని.. కేవలం వైద్యశాల నిర్లక్ష్యం, కక్కుర్తితోనే తన తండ్రి చనిపోయాడని సందీప్‌ కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కలెక్టర్‌ కర్ణన్‌ విచారణకు ఆదేశించారు. దీంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం దాకా బాలాజీ ఛెస్ట్‌ ఆసుపత్రిలో ఖమ్మం ఏసీపీ బి.ఆంజనేయులు స్వయంగా విచారణ జరిపారు. రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు ఇప్పటిదాకా ఎన్ని తీసుకున్నారు.. ఎన్ని వినియోగించారు.. ఎన్ని నిల్వ ఉన్నాయన్న దానిపై ఆడిట్‌ రిపోర్టులను పరిశీలించారు. రోగి కేస్‌ షీట్లను సైతం తనిఖీలు చేశారు. దీంతో ప్రాథమిక ఆధారాల మేరకు ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని మూసేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Published by:yveerash yveerash
First published: