మేడం.. నా పెళ్లి ఆపండి.. చదువుకుంటా.. షీ టీమ్‌కు బాలిక ఫోన్

ప్రతీకాత్మక చిత్రం

తనకు ఇప్పుడే పెళ్లి వద్దని.. బంధువులు, స్నేహితులకు చెప్పి కంటతడిపెట్టింది బాధితురాలు. వారి సాయంతో షీ టీమ్‌ పోలీసులకు ఆమె ఫోన్‌ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఐసీడీఎస్ అధికారులతో కలిసి బాలిక ఇంటికి వెళ్లారు.

 • Share this:
  తనకు ఇప్పుడే పెళ్లి వద్దని.. ఇంట్లో చెప్పినా వినకుండా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని.. ఓ బాలిక షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. తనకు ఉన్నత చదువులు చదువుకోవాలని ఉందని చెప్పి కంటతడిపెట్టింది. ఐసీడీఎస్ అధికారులు ఆమెను హైదరాబాద్‌లోని వసతి గృహానికి తరలించి.. చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణం జానంపేటలో ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 16 ఏళ్ల బాలిక ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. ఐతే తాను చదువుకుంటానని చెప్పినా వినకుండా పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు.

  షాబాద్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తితో సంబంధాన్ని కుదుర్చుకొని.. మే నెలలో నిశ్చితార్థం చేశారు. జులైౖ చివరి వారంలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఐతే తనకు ఇప్పుడే పెళ్లి వద్దని.. బంధువులు, స్నేహితులకు చెప్పి కంటతడిపెట్టింది బాధితురాలు. వారి సాయంతో షీ టీమ్‌ పోలీసులకు ఆమె ఫోన్‌ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఐసీడీఎస్ అధికారులతో కలిసి బాలిక ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో బాధితురాలు ఐసీడీఎస్‌ అధికారి నాగమణికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ వసతిగృహంలో చేర్పించి చదువుకునే అవకాశం కల్పించాలని కోరింది.

  బాలిక నుంచి ఫిర్యాదు అందుకున్న అధికారులు..అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమెను హైదరాబాద్‌ వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించారు. ఐతే తల్లిదండ్రుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. పదో తరగతి సర్టిఫికెట్ ఆధారంగా తమ కుమార్తెకు 18 ఏళ్లు నిండాయని.. మరో వ్యక్తిని ఇష్టపడుతున్న కారణంగానే పెళ్లికి నిరాకరిస్తోందని చెప్పారు. ఐతే అంగన్‌వాడీ రికార్డులు, ఆధార్‌ కార్డు ప్రకారం బాలిక వయసు పదహారేళ్లని అధికారులు తెలిపారు. ఈ వయసులో పెళ్లి చేస్తే బాల్య వివాహం అవుతుందని స్పష్టం చేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published: