ఖమ్మంలో వలకు చిక్కిన దెయ్యం చేప.. దీని ప్రత్యేకతలు ఇవే

ఖమ్మంలో వలకు చిక్కిన దెయ్యం చేప.. ప్రత్యేకతలు ఇవే

దెయ్యం చేపలకు సంబంధించిన విత్తన ఉత్పత్తి కూడా క్లిష్టమని, ఈ రకం చేపల విత్తనాన్ని బంగ్లాదేశ్‌లో ఉత్పత్తి చేస్తుంటారని అధికారులు చెప్పారు. తినడానికి పనికిరాకపోయినా, ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న కేజ్‌ పద్దతిలో చేపల పెంపకానికి దీన్ని సహాయకారిలా ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

 • Share this:
  (శ్రీనివాస్ రెడ్డి, న్యూస్ 18 ఖమ్మం ప్రతినిధి)
  చేపలన్నీ ఒక రకంగా ఉంటే ఇది మాత్రం మరో రకం. ఒక రకంగా ఇదో విచిత్రమైన రకం. ఒంటినిండా జీబ్రా టైపు గీతలతో.. పొడుగ్గా ఎలుక మూతి ఆకారంలోని నోటితో చూడ్డానికి కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది. అందుకే ఈ రకం చేపలకు 'దెయ్యంబేరు' అని పేరు పెట్టారు. అరుదుగా దొరికేది అయినా దీన్ని తినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. దీనికో స్పెషాలిటీ ఉంది. ఎక్కడ నాచు, పాచి కనిపించిందా అక్కడ నుంచి అస్సలు కదలదు. అక్కడే అంటిపెట్టుకుని తింటూ అక్కడ పూర్తిగా అయిపోయిందాకా ఉండడం దీని ప్రత్యేకత. అందుకే దీన్ని క్లీనింగ్‌ ఫిష్‌ అని.. పెల్కో ఫిష్‌ అని.. జానీటర్‌ ఫిష్‌ అని అంటుంటారు. సాంకేతిక పరిభాషలో శాస్త్రీయంగా చెప్పాలంటే దీన్ని 'సక్కర్‌ మౌత్‌ క్యాట్‌ ఫిష్'‌ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరిసింహులుగూడెంలోని ఓ చెరువులో డేగల వీరయ్య అనే వ్యక్తి చేపల కోసం వల వేయగా ఇది దొరికింది. చూడ్డానికి వికృతంగా ఉండడంతో దగ్గరిలోని పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రంలో దీన్ని అప్పగించారు. ఈ విచిత్రమైన ఆకృతి ఉన్న చేప గురించి 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధి మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన సైంటిస్ట్‌ డాక్టర్‌ విద్యాసాగర్‌రెడ్డిని ఆరా తీయగా దెయ్యంబేరుగా పిలుచుకునే ఈ రకం చేపలు దాదాపుగా వలకు దొరవన్నారు. చెరువులు, లేక రిజర్వాయర్లలోని లోతైన ప్రాంతాల్లో వాటికి ఆహారం దొరికే ప్రదేశాలను ఎంపిక చేసుకుంటాయన్నారు. వీటిలో మాంసం తక్కువ, ఎముకలు ఎక్కువగా ఉండడం వల్ల తినడానికి పెద్దగా ఆసక్తి చూపరని, వీటిని అక్వేరియంలలో పెంచుకోవడం కరెక్టన్నారు.

  దెయ్యం చేపలకు సంబంధించిన విత్తన ఉత్పత్తి కూడా క్లిష్టమని, ఈ రకం చేపల విత్తనాన్ని బంగ్లాదేశ్‌లో ఉత్పత్తి చేస్తుంటారని అధికారులు చెప్పారు. తినడానికి పనికిరాకపోయినా, ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న కేజ్‌ పద్దతిలో చేపల పెంపకానికి దీన్ని సహాయకారిలా, ఓ సర్వెంట్‌లాగా ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. నెలల తరబడి కేజ్‌లు నీళ్లలో ఉండిపోవడం వల్ల, ఏర్పడే నాచును, పాచిని ఈ రకం చేపలను కొద్ది సంఖ్యలో వదలి శుభ్రం చేసుకోవచ్చని సూచించారు. తద్వారా చేపల కేజ్‌లకు పట్టే పాచిని సులభంగా తొలగించుకునే వీలుంటుందన్నారు. తినడానికి మాత్రం పనికిరాకపోయినా.. దీని వల్ల ఎన్ని లాభాలున్నాయో చూశారా.. ఒక వేళ మీ ఇంట్లో అక్వేరియం ఉన్నట్లయితే దీన్ని ఒకటి తెచ్చుకుని వదలండి. దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసేస్తుంది.
  Published by:Shiva Kumar Addula
  First published: