హోమ్ /వార్తలు /తెలంగాణ /

గ్రేటర్‌లో మళ్లీ మొదలైన వరద సాయం.. నిన్న ఎంత ఇచ్చారంటే..

గ్రేటర్‌లో మళ్లీ మొదలైన వరద సాయం.. నిన్న ఎంత ఇచ్చారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నట్టు గ్రేటర్ కమిషనర్ లోకేశ్ కుమార్ ప్రకటించారు.

  గ్రేటర్ హైదరాబాద్‌లో వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తరువాత కూడా వరద బాధితులు అందించే ఆర్థిక సాయం కొనసాగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందే ప్రకటించారు. 7వ తేదీ నుంచి మళ్లీ వరద బాధితులకు నగదు సాయం అందిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న ఉదయం నుంచే పలువురు బాధితులు మీ సేవ సెంటర్ల ముందు క్యూ కట్టారు. అయితే గతంలో మాదిరిగా వరదసాయం కోసం బాధితులు మీ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.

  జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని ప్రకటించారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధృవీకరించుకున్న తరువాత వారి అకౌంట్ లోకి నేరుగా వరదసాయం డబ్బు జమ అయ్యిందని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ మంగళవారం నుండి ప్రారంభమైనదని, ఒక్క మంగళవారం నాడే 7939 మంది బాధితులకు రూ. 7 .949 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని వెల్లడించింది.

  వరదల కారణంగా నష్టపోయిన బాధితుల కుటుంబాలకు రూ. 10,000 వరద సాయం అందించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ తరువాత బాధితులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దీంతో బాధితులు పెద్ద ఎత్తున మీ సేవ సెంటర్లకు క్యూ కట్టారు. రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేరుగా అకౌంట్‌లో డబ్బులు పడ్డాయి. అయితే ఆ తరువాత ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని.. ఈ వరద సాయం నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు కూడా కొనసాగాయి. అయితే ఎన్నికల తరువాత వరద బాధితులకు అందించే సాయం కొనసాగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు 7939 మంది బాధితులకు రూ. 7 .949 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని జీహెచ్ఎంసీ వెల్లడించింది.

  రాబోయే రోజుల్లోనే ఈ సాయం కొనసాగుతుందని తెలిపింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: GHMC, Hyderabad Floods, Telangana

  ఉత్తమ కథలు