హైదరాబాద్ సనత్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ అధికారులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఆయనకు జరిమానా విధించారు. ఈ మేరకు రూ.5వేలు జరిమానా కట్టాలంటూ శనివారం నోటీసులు జారీచేశారు. ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. దీంతో ముఖ్యమంత్రి మీద అభిమానాన్ని చాటుకోవడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరుతో ఆయన ఫ్యాన్స్ నగరంలో కటౌట్లు ఏర్పాటు చేశారు. ‘వి లవ్ కేసీఆర్. మీ తలసాని శ్రీనివాస్ యాదవ్’ పేరుతో కటౌట్లు ఏర్పాటు చేశారు. అందులో కేసీఆర్, కేటీఆర్ కటౌట్లతో పాటు తలసాని ఫొటోలు కూడా పెట్టారు. అయితే, జీహెచ్ఎంసీ పరిధిలో కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేయాలంటే అనుమతి తీసుకోవాలి. అయితే, ఎలాంటి అనుమతి తీసుకోకుండా కటౌట్లు ఏర్పాటు చేశారంటూ మంత్రికి అధికారులు జరిమానా విధించారు.
మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా
2019లో కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు భారీ ఎత్తున నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నెక్లెస్ రోడ్లో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీ ఫేస్ మెంట్ యాక్ట్ కు విరుద్ధంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు తలసానికి జరిమానా విధించారు. జరిమానా కింద రూ.25 వేలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు.
వి లవ్ కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన కటౌట్
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి హడావిడి చేయవద్దంటూ ఇటీవల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అందరూ మొక్కలు నాటాలని సూచించారు. అయితే, అభిమానులు మాత్రం ఉత్సాహంతో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.