హైదరాబాద్‌లో వరదల కారణంగా నష్టపోయిన వారికి ఎన్నికల ఫలితాల తర్వాతనే వరద సహాయం చేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వరద బాధితులకు సహాయం యధావిధిగా కొనసాగించాలన్న పిటీషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. . బాధితులకు సహాయం ఆపకూడదని ఎలక్షన్ కమిషన్ కోడ్ అఫ్ కండక్ట్‌లో ఉందా అని కోర్టు ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించింది. కేంద్ర ఎన్నికల నియమావళి జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. వరద బాధితుల కోసం విడుదల చేసిన ఫండ్‌ని కొంతమంది పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని.. అందుకే ఆ పథకాన్ని ప్రస్తుతం ఆపాలని నిర్ణయించామని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది.
పథకం తప్పుదోవ పడుతుందనే ఉద్దేశంతోనే నిలిపివేశామని.. కేవలం ఎన్నికల జరిగేంత వరకే దీనిని ఆపామని.. తర్వాత యధావిధిగా కొనసాగించుకోవచ్చని ఎలక్షన్ కమిషన్కోర్టుకు వివరించింది. ఇక ప్రభుత్వంతో చర్చించకుండా వరద బాధితులకు ఇచ్చే 10,000 రూపాయల సహాయం ఆపడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ శరత్ కోర్టుకు తెలిపారు. వరద బాధితులకిచ్చే సహాయం మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ క్రింద రాదని చెప్పిన ఎన్నికల కమిషన్.. 24 గంటల వ్యవధిలోనే మాట మార్చిందని ఆరోపించారు.
ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే వరద బాధితుల సహాయం పథకం అమలులోకి వచ్చిందని తెలిపారు. అయితే పిటిషనర్ తరపు వాదనలు విన్న ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే బాధితుల అకౌంట్లో డబ్బులు ఎందుకు వేయలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వచ్చే నెల 4న దీనిపై కౌంటర్ ధాఖలు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4వ తారీఖు తర్వాత డబ్బుల పంపిణీ చేయొచ్చని తెలిపింది. తదుపరి విచారణను హై కోర్టు వచ్చే నెల 4కు వాయిదా వేసింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.