news18-telugu
Updated: November 26, 2020, 8:07 PM IST
చంద్రబాబు (ఫైల్ ఫోటో)
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌తో పాటు టీడీపీ కూడా పోటీ చేస్తోంది. ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేకుండానే ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. ఐతే హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్ర ఉందని పదే పదే చెప్పే.. చంద్రబాబు ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ కోసం ఢిల్లీ నుంచి నేతలు వస్తుంటే.. ఇక్కడే ఉన్న చంద్రబాబు, టీడీపీ అభ్యర్థుల తరపున ఎందుకు ప్రచారం చేయడం లేదని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో గ్రేటర్ ఎన్నికల్లో నేతల మాటల తూటాలపై చంద్రబాబు స్పందించారు. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చివేయాలన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ట్విటర్ వేదికగా ఖండించారు చంద్రబాబు. తెలుగుజాతికి గర్వకారణమైన మహనీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా? అని మండిపడ్డారు.
'' తెలుగువారికి గర్వకారణంగా జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగువెలుగులు ఎన్టీఆర్ మరియు పీవీ నరసింహారావు. దేశంలో పేదల సంక్షేమానికి బాటలువేసింది ఎన్టీఆర్ అయితే...ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా, సాంకేతిక ఫలాలను పేదలకు అందించిన మేధావి పీవీ. ఇటువంటి మహానీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా? హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర అందరికీ తెలుసు. అటువంటి పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ సమాధిని కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నిస్వార్థ రాజకీయాలతో, ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే పథకాలతో తెలుగువారి ఆరాధ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్ పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తెలుగువారందరినీ అవమానించడమే.'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇటీవల పాతబస్తీలో ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఓవైసీ.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోందని.. అలా చేస్తే హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 4,700 ఎకరాలున్న హుస్సేన్ సాగర్ ప్రస్తుతం 700 ఎకరాలు కూడా లేదని అన్నారు. ఎంఐఎం చేసిన ఈ వ్యాఖ్యలపై గ్రేటర్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో అడుగు ముందుకేసి.. ఓవైసీకి దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలని సవాల్ విసిరారు. ఒకవేళ ఆయన కూల్చితే.. పది నిమిషాల్లోనే దారుస్సలాంను పడగొడతామని హెచ్చరించారు. అంతేకాదు గురువారం పీవీ ఘాట్‌ను సందర్శించిన బండి సంజయ్.. ఘాట్లకు బీజేపీ రక్షణగా ఉంటుందని ప్రమాణం చేశారు. ఓవైసీ బ్రదర్స్ ఇష్టానుసారం మాట్లాడితే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 26, 2020, 7:59 PM IST