news18-telugu
Updated: December 1, 2020, 8:35 PM IST
ప్రతీకాత్మక చిత్రం(Image;Twitter)
తెలంగాణ రాజకీయాలను జీహెచ్ఎంసీ ఎన్నికలు హీటెక్కించాయి. వణుకు పుట్టే చలిలో నగర రాజకీయాల్లో సెగలు రేపాయి. ఎప్పుడూ లేనంతగా అన్నిపార్టీలు బల్దియా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కేంద్రమంత్రులు, జాతీయ నేతలు, పక్క రాష్ట్రాల సీఎంలు.. నగరానికి క్యూకట్టారు. ప్రచారాలకు జనం కూడా పెద్ద ఎత్తున వెళ్లారు. వాటిని చూసి ఈసారి భారీ పోలింగ్ నమోదవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తీరా పోలింగ్ సమయానికి అంతా రివర్స్ అయింది. అత్యల్ప పోలింగ్ నమోదయింది. హైదరాబాద్ వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.
హైదరాబాద్‌లో తక్కువ పోలింగ్ నమోదవడంపై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది. వైన్ షాప్‌ల ముందు క్యూలైన్లో ఉన్నప్పుడు కనిపించని కరోనా.. ఓటేసే సమయానికి గుర్తొచ్చిందా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కొత్త సినిమా టికెట్ల కోసం క్యూలైన్లో నిలబడే జనాలకు.. ఓటు వేసేందుకు మాత్రం ఓపిక లేదని విమర్శిస్తున్నారు. లాక్డౌన్లో కరోనా ఉంది.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటే కుప్పలు తెప్పలుగా వచ్చారు. కానీ ఇప్పుడు ఓటు వేసేందుకు బయటకు రమ్మంటే మాత్రం.. ముసుగు తన్ని పడుకున్నారు. ఇలా నగర ప్రజలపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. వాటిని ఇక్కడ చూడండి
కాగా, ఇవాళ జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ నమోదయింది. 40శాతం కూడా దాటలేదు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ.. ఎక్కడా క్యూలైన్లు కనిపించలేదు. పోలింగ్ కేంద్రాలన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలు దయచేసి ఇళ్ల నుంచి వచ్చి ఓటేయాలని.. ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఎవరూ ముందుకు రాలేదు. ఓటు వేసేందుకు అనాసక్తి చూపించారు. గుర్తులు తారుమారవడంతో ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లో పోలింగ్ రద్దయింది. డిసెంబరు 3న అక్కడ రీపోలింగ్ జరగనుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించారు. డిసెంబరు 4న 150 డివిజన్లలో ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు.
Published by:
Shiva Kumar Addula
First published:
December 1, 2020, 8:28 PM IST