GHMC Elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని బాంబు పేల్చారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని బండి సంజయ్ (Bandi sanjay) అభిప్రాయపడ్డారు.
జీహెచ్ఎంసీ (Greter Hyderabad Municipal corporation) ఎన్నికల వేళ ప్రచారం మరింత వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ముందు నుంచీ దూకుడు మీదున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay).. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని బాంబు పేల్చారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారని.. సీఎం ఇచ్చిన స్క్రిప్ట్‌ను మీరెందుకు చదువుతున్నారని విమర్శించారు.
భోలక్‌పూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుంది. మధ్యంతర ఎన్నికలు తప్పవు. కేసీఆర్‌పై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు. ఆయన జైలుకు పోవటం ఖాయం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కో డివిజన్‌కు 5 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండి. కానీ బీజేపీకి ఓటు వేయండి. కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలెవరూ వెళ్ళటం లేదు. కేసీఆర్, ఆయన కుటుంబం మంచిగా ఉంటే చాలు. ఇంకెవరూ ఆయనకు అవసరం లేదు. ప్రజల కష్టాలు పట్టవు.'' అని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారం మొదలయినప్పటికీ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు బండి సంజయ్. జీహెచ్ఎంసీలో గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడంతో రాష్ట్ర రాజకీయాల్లో రచ్చ నెలకొన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఎన్టీఆర్ (NTR), పీవీ నరసింహారావు (PV Narasimharao) ఘాట్లను కూల్చాలన్న ఓవైసీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఒకవేళ అలా జరిగితే దారుస్సలాంను కూడా కూల్చుతామని హెచ్చరించారు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యానించడం మరోసారి చర్చనీయాంశమైంది.
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే నగరంలో నేడు సీఎం కేసీఆర్ సభ జరగనుంది. మరోవైపు బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఇక, డిసెంబర్ 1వ తేదీన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రీపోలింగ్ చేపట్టనున్నారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే పోలింగ్ జరగనుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.