news18-telugu
Updated: December 1, 2020, 3:44 PM IST
ప్రతీకాత్మక చిత్రం
మన హైదరాబాద్ చాలా ప్రశాంతమైన నగరం. కొన్నేళ్లుగా ఇక్కడ కర్ఫ్యూలు లేవు. ఘర్షణలు లేవు. ప్రజలంతా కలిసి మెలిసి సంతోషంగా జీవిస్తున్నారు. ఐటీ హబ్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరున్న హైదరాబాద్‌లో ఉన్నత విద్యావంతులు ఎక్కువ మందే ఉన్నారు. ఈ విషయాల్లో మన హైదరాబాద్ ఎంతో గ్రేట్. కానీ పోలింగ్ విషయంలో మాత్రం దారుణంగా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఇంత తక్కువగా ఉండడం. సిగ్గుచేటు. హైదరాబాద్ కన్నా కాశ్మీరే బెటర్ అనిపిస్తుంది. అక్కడ జరుగుతున్న జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికల్లో హైదరాబాద్ కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయింది.
జమ్మూకాశ్మీర్‌లో ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగిశాయి. ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 11 గంటల వరకు 23.67శాతం పోలింగ్ నమోదయింది. అదే సమయానికి మన హైదరాబాద్‌లో 10శాతం కూడా లేదు. కేవలం 8.9శాతం పోలింగ్ మాత్రమే నమోదయింది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 18.2 శాతం పోలింగ్ నమోదయితే.. కాశ్మీర్లో 40.2 శాతం పోలింగ్ నమోదయింది.
ఈ గణాంకాలు చూస్తేనే అర్ధమవుతోంది. పోలింగ్ విషయంలో హైదరాబాద్ కంటే జమ్మూకాశ్మీర్ ఎంత నయమో. జమ్మూకాశ్మీర్‌లో సాధారణంగా తక్కువ పోలింగ్ నమోదువుతుంది. ఉగ్రదాడులు, అల్లర్లు వంటి కారణాలతో చాలా తక్కువ సంఖ్యలో జనం ఓటేస్తారు. కానీ ప్రశాంతంగా ఉండి, ఐటీ హబ్‌గా పేరున్న మన హైదరాబాద్‌లో.. కాశ్మీర్ కంటే తక్కువ సంఖ్యలో పోలింగ్ నమోదవడం సిగ్గుచేటు.
ఎన్నికల రోజున ఓటు వేసేందుకు ప్రభుత్వాలు సెలవులు ఇస్తే.. హైదరాబాద్‌లో చాలా మంది ప్రజలు ఎంజాయ్ చేయడానికి ఆ సెలవును ఉపయోగించుకున్నాడు. పోనీ ఓ గంట సమయం కేటాయించి.. ఓటు వేస్తున్నారా? అంటే అది లేదు. బద్ధకంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదు. ముసలీముతకా ఓటు వేస్తున్నా.. చదువుకున్న యువత, సంపన్న కుంటుంబాల ప్రజలు మాత్రం ఓటు వేయడం లేదు. ప్రభుత్వాలు, సెలబ్రిటీలు, మీడియా ఎంత ప్రచారం చేసినా.. నగరంలో పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఐతే 1-3 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. మరి తగ్గిన ఈ పోలింగ్ ఎవరికీ అనుకూలమవుతుంది? ఎవరి కొంపముంచుతున్నది.. డిసెంబరు 4న తేలనుంది.
Published by:
Shiva Kumar Addula
First published:
December 1, 2020, 3:37 PM IST