news18-telugu
Updated: November 26, 2020, 10:49 PM IST
హరీశ్ రావు
గ్రేటర్లో ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారంలో నేతలు బిజీగా ఉన్నారు. అధికార టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి హరీష్ రావు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం నగరంలోని భారతీనగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. బీజేపీ, ఎంఐఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరుపార్టీలు ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని ధ్వజమెత్తారు. చేసిన అభివృద్ధి, చేయాల్సిన అభివృద్ధి గురించి చెప్పకుండా కూల్చుతాం, కాల్చుతాం అని రెచ్చగొడుతున్నారని విరుచుకుపడ్డారు హరీష్ రావు.
'' టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ నల్లా పెట్టి తాగునీరు అందిస్తున్నాం. ఇప్పుడు నల్లా బిల్లులు కూడా రద్దు చేస్తున్నాం. రాష్ట్రంలో విద్యుత్ కోతల ఊసే లేదు. కరోనా వల్ల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఆలస్యమైంది. ఇళ్లు లేని పేదలకు త్వరలోనే రెండు పడకగదుల ఇళ్లను కేటాయిస్తాం. వరద సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఎన్నికల తర్వాత బాధితులందరికీ రూ.10వేలు ఇస్తాం. ఓట్ల కోసం కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ప్రశాంత హైదరాబాద్ కావాలా? లేక విధ్వంస హైదరాబాద్ కావాలా? ప్రజలే తేల్చుకోవాలి.'' అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారని..కానీ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల బాధ్యతను సీఎం కేసీఆర్ తీసుకుంటున్నాని హరీష్ రావు అన్నారు. బీహెచ్ఈఎల్ సంస్థకు రూ.40 వేల కోట్ల ఆర్డర్ ఇచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. సీఎంతో మాట్లాడి ఆసరా పథకం ద్వారా బీహెచ్ఈఎల్ విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ ఇప్పిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. నగర అభివృద్ధిని చూసి.. అమెజాన్ కంపెనీ రూ.21వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ఉస్మాన్‌సాగర్‌లో ఐటీ పార్క్, సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైస్ పార్క్ వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 26, 2020, 10:49 PM IST