గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల పోలింగ్ ముగిసినా.. ఇంకా రచ్చ కొనసాగుతోంది. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఎంఐఎం నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. నగరంలో 46.6శాతం పోలింగ్ నమోదయింది. కానీ పాతబస్తీలో మాత్రం కొన్ని బూత్‌లలో 95శాతం పోలింగ్ నమోదవడంపై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎమ్మెల్యీ రాంచంద్రరావు నేతృత్వంలోని బృందం కలిసింది. ఘాన్సీ బజార్, పురానాపూల్‌లో ఎంఐఎం నేతలు దొంగ ఓట్లు వేశారని ఫిర్యాదు చేశారు. ఘాన్సీ బజార్లో 1 నుంచి 19 పోలింగ్ కేంద్రాలు, పురానాపూల్‌లో 3, 4, 5, 38-45 పోలింగ్ కేంద్రాల్లో రిపోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని.. అబ్జర్వర్లను పంపి విచారణ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ రాంచంద్రరావు తెలిపారు.
'' పాతబస్తీలో ఎంఐఎం అక్రమాలకు పాల్పుడుతుందని ముందే చెప్పాం. ఘాన్సీ బజార్, పురానాపూల్‌లో రిగ్గింగ్ జరిగింది. ఈ రెండు చోట్ల 94 శాతంపైగా పోలింగ్ నమోదుకావడమే ఇందుకు నిదర్శనం. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి రిగ్గింగ్ చేశారు. రిగ్గింగ్ జరుపుకునేందుకే బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించారు. ఈవీఎం పద్దతిలో నిర్వహించాలని బీజేపీ చెప్పినా అందుకే పట్టించుకోలేదు. ఈ రెండు డివిజన్లలో రిపోలింగ్ నిర్వహించాలి. ఐతే అబ్జర్వర్లను పంపి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది.'' అని రాంచంద్రరావు పేర్కొన్నారు.
అటు కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికల సంఘాన్ని కలిశారు. షేక్‌పేటలో ఎంఐఎం నేతలు పోలింగ్ బూత్‌ను క్యాప్చర్ చేశారని ఫిర్యాదుచేశారు.
పోలింగ్ సిబ్బంది, పోలీసులు ఎంఐఎంకు సహకరించారని ఆరోపించారు. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.60 శాతం పోలింగ్ నమోదయింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం ఓట్లు పోలయ్యాయి. గతం కంటే ఈసారి కాస్త ఎక్కువ పోలింగ్ నమోదయింది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 1.31 శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. మొత్తం 150 డివిజన్లలో కంచన్‌బాగ్‌లో అత్యధిక పోలింగ్ నమోదయింది. అక్కడ 70.39శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక అత్యల్పంగా యూసఫ్‌గూడలో 32.99 శాతం పోలింగ్ నమోదయింది.
ఓల్డ్ మలక్ పేట్లో పోలింగ్ రద్దయిన విషయం తెలిసిందే. సీపీఐ అభ్యర్థికి సీపీఎం ఎన్నికల గుర్తుకేటాయించడంతో.. ఆ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు అక్కడ పోలింగ్‌ను అధికారులు రద్దు చేశారు. డిసెంబరు 3న ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో రీపోలింగ్ జరగనుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించారు. డిసెంబరు 4న 150 డివిజన్లలో ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.