Case against BJP MP Dharmapuri Aravind: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు. పలువురు ప్రత్యర్థి పార్టీ వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనపై ఐపీసీ 504, 506, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని టీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్న ఓ హోర్డింగ్‌పై కేసీఆర్, కేటీఆర్ బొమ్మలు ఉండటాన్ని తప్పుబట్టిన ధర్మపురి అరవింద్.. ఈ ఫ్లెక్సీలపై తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడంతోపాటు వాటిని ధ్వంసం చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో ఆయన అనుచరులు టీఆర్ఎస్ ఫ్లెక్సీని చించేశారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ లీగల్ సెల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీలను చించడంతోపాటు నగరంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పాలన్న దురుద్దేశంతో ఈ పని చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతే టీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న ధర్మపురి అర్వింద్‌పై ఐపీసీ 228, 425, 427, 503, 504, 505, 506, 507, రెడ్‌విత్ 34తో పాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు. వారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఐపీసీ 504, 506, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dharmapuri Arvind, Telangana