GHMC ELECTION RESULTS 2020 EVERYTHING READY FOR GHMC VOTES COUNTING MEHDIPATNAM MAY GIVE FIRST RESULT AK
GHMC Election Results 2020: గ్రేటర్లో కౌంటింగ్‌కు అంతా రెడీ.. తొలి ఫలితం అక్కడి నుంచే..
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad GHMC Elections Results 2020: కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. హాల్లో లెక్కింపు ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరా, వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయనున్నారు. కౌంటింగ్ హాళ్లలోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు.
అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెలువడనున్నాయి. ఇందుకు సంబంధించి ఓట్ల కౌంటింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిల్స్‌లో కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి 150 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేసింది. ఒక్కో హాల్లో 14 కౌంటింగ్ టేబుల్స్ సిద్ధం చేసింది. ఒక్కో రౌండ్‌కి 14,000 ఓట్లను లెక్కిస్తారు. మూడు రౌండ్లలోనే పూర్తి ఫలితం వెలువడనుంది. గ్రేటర్ ఎన్నికల్లో పోలైన ఓట్లను బట్టి చూస్తే ముందుగా మెహిదీపట్నం డివిజన్ ఫలితం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి రౌండ్ వివరాల వెల్లడి 11 గంటల తర్వాతే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మెహదీపట్నం డివిజన్లో 11,818 వేల ఓట్లు పోలయ్యాయి. చాలా వార్డుల్లో 15 నుంచి 27 వేల వరకు ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో 136 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు రెండవ రౌండ్లలో వెలువడే ఛాన్స్ ఉంది. ఇక అత్యధికంగా ఓట్లు పోలైన ఉప్పల్, కంచన్‌బాగ్, మైలార్ దేవరపల్లి, అంబర్‌పేట, రెహమత్నగర్, కొండాపూర్, అల్లాపూర్, ఓల్డ్ బోయిన్పల్లి, సుభాష్‌నగర్, గాజుల రామారం, తార్నాక, సీతాఫల్ మండి, బన్సీలాల్‌పేట్ ఫలితాలు మూడో రౌండ్లో వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. పోటీలోని క్యాండిండేట్లు ఒక్కో కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక్కో ఏజెంట్‌ను నియమించుకోవచ్చని తెలిపింది. అభ్యర్థి లేదా అభ్యర్థి తరపున ఎలక్షన్ ఏజెంట్, అడిషనల్ కౌంటింగ్ ఏజెంట్‌నే కౌంటింగ్ టేబుల్ దగ్గరకు అనుమతించనున్నారు. హాల్లో లెక్కింపు ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరా, వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయనున్నారు. కౌంటింగ్ హాళ్లలోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు. కౌంటింగ్‌లో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 2,629 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారు. అయితే వాటిలో రేపు ఉదయం 8 గంటలలోపు కౌంటింగ్ సెంటర్‌కు వచ్చే పోస్టల్ బ్యాలెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే గ్రేటర్‌లోని 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 74,67,256 ఓట్లు ఉండగా 34,50,331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 18,60,400 మంది పురుషులు తమ ఓటు వేయగా, 15,90,219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతరులు 72 మంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.