Home /News /telangana /

GHMC ELECTION RESULT 2020 CONTESTANTS AND LEADERS FEELING TENSION AS TIME GETTING NEAR FOR VOTES COUNTING AK

GHMC Election Result 2020: గంట గంటకు పెరుగుతున్న టెన్షన్.. అభ్యర్థులతో పాటు ఆ నేతల్లోనూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

GHMC Election Results 2020: గతంలో మాదిరి కాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఈసారి ఒక ఊపు మీద జరిగాయి. అభ్యర్థులతో పాటు వారికి గెలిపించేందుకు నేతలు కూడా అంతేస్థాయిలో కష్టపడ్డారు.

    జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లోనే రానున్నాయి. నగరంలోని ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోరాడిన ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరికి దక్కుతాయనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో నెలకొన్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఓటింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా నాయకుల్లో ఆందోళనను మరింతగా పెంచేలా చేసింది. ఇక ఆయా పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న నేతలను సైతం ఎన్నికల ఫలితాలు టెన్షన్ పెడుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌తో పాటు గ్రేటర్‌లో మెజార్టీ సీట్లు సాధించాలని పట్టుదలగా ఉన్న బీజేపీ సైతం డివిజన్ల వారీగా నేతలను ఇన్‌ఛార్జ్‌గా నియమించాయి.

    అధికార టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలకు అభ్యర్థుల గెలుపు బాధ్యతను అప్పగించింది. దీంతో తాము పని చేసిన అభ్యర్థుల ఫలితం విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. అధిష్టానం దగ్గర తమ ఇమేజ్ పడిపోతుందనే భావనలో నేతలు ఉన్నారు. గతంలో మాదిరి కాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఈసారి ఒక ఊపు మీద జరిగాయి. ప్రచారంలో చాలామంది కనిపించినా ఓటింగ్‌కు మాత్రం నగర యువత దూరంగా ఉంది. ఓటింగ్‌ శాతం భారీగా తగ్గడంతో మెజారిటీ దేవుడు ఎరుగు... గట్టెక్కితే చాలనే అభిప్రాయంతో డివిజన్ల ఇన్‌చార్జ్ నేతలు ఉన్నారు.

    అయితే నేతలెవరికీ ఓటర్ల అంతరంగం అంతుపట్టడం లేదని తెలుస్తోంది. గెలుపు తమదే అనే ధీమాను పలువురు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. కౌంటింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు, నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. తమకు వచ్చే ఓట్లు విషయంలో పోస్ట్ పోల్ సర్వేలు కూడా కొందరు నేతలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. అయినా చాలామందికి ఓటరు నాడి తెలియడం లేదని సమాచారం. దీంతో ఫలితాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. అభ్యర్థులు, వారి గెలుపు కోసం పని చేసిన నేతల్లో మాత్రం అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: GHMC Election Result, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు