హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనల సందడి నెలకొంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన కార్యక్రమం సజావుగా పూర్తయింది. గణపతి బప్పా నినాదాల మధ్య ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడిని చేరాడు. ట్యాంక్ బండ్లో నాలుగో నెంబర్ క్రేన్ వద్ద ఈ గణనాథుడిని నిమజ్జనం చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ సారి కేవలం 9 అడుగుల విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఊరేగింపు కార్యక్రమం కూడా సాదాసీదాగా జరిగింది. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు హాజరయ్యారు. ప్రతిసారి సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శనల మధ్య ఘనంగా నిమజ్జనోత్సవం జరిగేది. కాని ఈసారి అలాంటివేమీ లేకుండానే నిరాడంబరంగానే నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
మరోవైపు నగరం నలువైపుల నుంచి ట్యాంక్ బంద్‌కు గణనాథులు తరలివస్తున్నారు. శోభాయత్ర జరిగే మార్గాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీీసీ కెమెరాలతో కంట్రోల్ రూమ్ నుంచి అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి నాటికి నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశముందని పోలీసులు తెలిపారు. గణేష్ నిమజ్జన నేపథ్యంలో నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. కాగా, కరోనా నేపథ్యంలో ఈసారి బాలపూర్ లడ్డూ వేలాన్ని రద్దు చేశారు. ఆ లడ్డూను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh immersion, Hyderabad, Khairatabad ganesh, Telangana