GALWAN VALLEY HERO TELANGANAS COLONEL SANTOSH BABU LIKELY TO BE POSTHUMOUSLY AWARDED MAHAVIR CHAKRA ON REPUBLIC DAY SRD
Colonel Santosh Babu : తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు అత్యుత్తమ సైనిక పురస్కారం..? రేపే ప్రదానం..
Colonel Santosh Babu
Colonel Santosh Babu : గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో వీరోచితంగా పోరాడి అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం దక్కనుందని తెలుస్తోంది.
గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో వీరోచితంగా పోరాడి అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం దక్కనుందని తెలుస్తోంది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం ప్రతిష్ఠాత్మక మహావీర చక్ర అవార్డును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు దేశ రాజధానిలో నిర్వహించే వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ఈ అవార్డును అందజేస్తారని సమాచారం. ఈ ఏడాది మహావీర చక్ర అవార్డు కోసం కల్నల్ సంతోష్ బాబు పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. దేశ రక్షణకు సంబంధించినంత వరకు రెండో అత్యుత్తమ పురస్కారం మహవీర చక్ర. ఈ ఏడాది ఈ అవార్డును కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం ప్రదానం చేయబోతోన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు ధృవీకరించినట్లు జాతీయ వార్తా సంస్థ నిర్ధారించింది. మిలటరీ అవార్డుల్లో అత్యుత్తమైనది పరమవీర్ చక్ర. ఆ తరువాత మహవీర్ చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర పతాకాలను అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను భావిస్తారు.
గతేడాది ఏడాది జూన్ 15వ తేదీన లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు జరిపిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఆయనతో పాటు 20 మంది అమరులు అయ్యారు. ఆయనతో పాటు సిపాయ్ ఓఝా, హవల్దార్ పళనిలకు అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను అందజేస్తారని తెలుస్తోంది. లఢక్ ఈశాన్య ప్రాంతంలో భారత భూభాగంపైకి అక్రమంగా చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ బలగాలను నిరోధించే సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
18 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్గా ఉన్న కల్నల్ సంతోష్ బాబు సారథ్యంలో జవాన్లు చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని అడ్డుకోగలిగారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి.. వారిని వెనక్కి తరిమి కొట్టగలిగారు. ఈ ఘర్షణల్లో రెండు వైపులా ప్రాణనష్టం సంభవించింది. చైనా తరఫున 50 మందికి పైగా పీఎల్ఏ సైనికులు మరణించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఆ దేశ సైన్యాధికారులు దాన్ని ధృవీకరించలేదు. చైనా బలగాలను తరిమికొట్టడంలో, వారి దురాక్రమణను నిరోధించడంలో కల్నల్ సంతోష్ బాబు వీరోచితంగా పోరాడారని, చివరికి ప్రాణాలను సైతం వదిలారని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు . అప్పట్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. దేశ రక్షణ కోసం ఆయన చూపిన తెగువ, ఓ వైపు ప్రాణాలు పోతాయని తెలిసినా.. అక్కడి నుంచి కదలకుండా చూపిన నిబద్ధత గురించి తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుస్తాయ్.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.