• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • GADWAL HANDLOOM WEAVERS FACES PROBLEMS DUE TO CORONA PANDEMIC SK

కరోనాతో కళ చెదిరిన చేనేత పరిశ్రమ.. కూలీ పనులకు కార్మికులు

కరోనాతో కళ చెదిరిన చేనేత పరిశ్రమ.. కూలీ పనులకు కార్మికులు

కరోనాతో కళ చెదిరిన చేనేత పరిశ్రమ.. కూలీ పనులకు కార్మికులు

ప్రస్తుత కరానా పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోతే చేనేత కళనే కనమరుగయ్యే ప్రమాదముందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తులు చేనేతను కేవలం వ్యాపారంగా మాత్రమే చూశారని, కళగా గుర్తించి ప్రోత్సహించలేదని వాపోతున్నారు.

  • Share this:
    జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి గ్రామం అంటేనే చేనేత గురుకువస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు గుర్తింపు తెచ్చిన వాటిలో రాజోలి కూడా ఒక గ్రామం. అటువంటి గ్రామంలో చేనేత కార్మికులు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు. వృత్తినే నమ్ముకుని కొన్నేళ్లుగా జీవనం చేస్తున్న వారి కుటుంబాల్లో కరోనా అల్లకల్లోలం లేపింది. బ్రతుకు జీవుడా అని తమ వృత్తిని వదులుకొని పొట్టకూటి కోసం ఉపాధి పనులకు, వ్యవసాయ కూలీ పనులు చేయడంలో తలమునకలవుతున్నారు.

    కూలి పనులతో చేతులు మొద్దుబారి పట్టు దారం చేతికి చిక్కడం లేదని, దారం పట్టు తప్పుతుండడంతో చీరలు నేయలేకపోతున్నామని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు చేనేత పరిశ్రమనూ దెబ్బతీసింది. నేత కార్మికుల జీవనాధారాన్ని అతలాకుతలం చేసింది. వారు తయారుచేసిన చీరలు అమ్ముకునే పరిస్థితి లేక, కుటుంబాన్ని పస్తులు ఉంచలేక తరతరాలుగా వస్తున్న వృత్తిని వీడి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు. కూలీ పనికి వెళ్తుండడంతో చేతులు మొద్దుబారుతున్నాయి. దీంతో చీరలు తయారు చేసేందుకు వీలు కాదని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు మగ్గం పనిముట్లను, పరికరాలను అమ్ముకుని.. పండ్లు, కూరగాయల వ్యాపారాలు చేసుకుంటున్నారు. చాలా కాలంగా నేత పని మాత్రమే వచ్చిన కొందరు కూలికి వెళ్లలేక కూల్‌డ్రింక్‌ షాపుల్లోను, హోటళ్లలోనూ పని చేసుకుని బతుకుబండిని లాగుతున్నారు. వారిని ప్రభుత్వం గుర్తించి చేనేత కార్మికులకు ప్రత్యేకంగా నెలసరి వేతనం ఇవ్వాలని, లేదా 50 సంవత్సరాలు పైబడిన అన్ని కుటుంబాలకూ ఆసరా పింఛన్ కల్పించాలని కోరుతున్నారు.

    చేనేత కార్మికుడు

    చిన్నప్పటి నుంచి నేత పనే చేస్తున్నాను. ఇప్పుడు ఉపాధి లేక మొగ్గం పనిముట్లను అమ్ముకుని కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ప్రభుత్వం స్పందించి కార్మికుల వద్ద నిల్వ ఉండిపోయిన పట్టు చీరలను కొనుగోలు చేయాలి. అప్పుడే నేతన్నలకు మనుగడ సాధ్యమవుతుంది. మూడు పూటలా కడుపు నింపుకునెందుకు ఈ కూరగాయల వ్యాపారమే దిక్కయింది.
    వెంకటేష్‌, రాజోలి చేనేత కార్మికుడు


    మాకు కుటుంబానికి తెలిసింది పట్టు చీరల తయారీ మాత్రమే. ప్రస్తుతం కరోనా కారణంగా ఉపాధి కరువైంది. ఇటు వృత్తిని వదులుకోలేక, అటు కూలి పనికి వెళ్లలేక కూల్‌డ్రింక్‌ షాపులో పని చేస్తున్నాను. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోతే బతకడమే కష్టం. కుటుంబ భారం కష్టంగా నెట్టుకుంటూ రోజుకి రెండు వందల రూపాయలకు కూల్ డ్రింక్ షాప్‌లో పని చేయడం బాధగా ఉంది.
    వీరేష్‌, రాజోలి చేనేత కార్మికుడు


    గత మూడేళ్లుగా నమ్ముకున్న వృత్తి కష్టంగా మారింది. చేసిన పనికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీనికితోడు కరోనా వైరస్ తాకిడికి మా చేనేత కార్మికులంతా రోడ్డున పడ్డారు. రాబోయే రోజుల్లో చేనేత కార్మికులు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు. భవిష్యత్తులో పలనా రాజోలిలో చేనేత కార్మికులు ఉంటారని చరిత్ర చెప్పుకోవడానికి తప్ప ఇకనుంచి కనిపించని పరిస్థితులు లేవు. ప్రభుత్వం గుర్తించకపోతే ఆత్మహత్యలు చెలుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
    మధు, చేనేత కార్మికుడు



    ప్రభుత్వం ఆదుకోవాలి..
    ప్రస్తుత కరానా పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోతే చేనేత కళనే కనమరుగయ్యే ప్రమాదముందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తులు చేనేతను కేవలం వ్యాపారంగా మాత్రమే చూశారని, కళగా గుర్తించి ప్రోత్సహించలేదని వారు చెప్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్కెటింగ్‌ అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం, చీరల కొనుగోళ్లు సాగకపోవడంతో దళారులు చేతులెత్తేశారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని, చేనేత కార్మికులు తయారు చేసిన పట్టుచీరలను ఆప్కో ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. డిమాండు ఉన్న రాష్ర్టాలకు ఎగుమతి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతీ నేతన్న కార్మికుడి కుటుంబానికి 50 శాతం సబ్సిడీతో వడ్డీలేని రుణం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు