ఖమ్మంలో కోవిడ్ వ్యాప్తి కేంద్రాలుగా ఫంక్షన్ హాల్స్..ప్రజాప్రతినిధుల సాక్షిగా రూల్స్ బ్రేక్

బైపాస్‌ రోడ్‌లో ఓ ఫంక్షన్‌ హాల్‌ వద్ద గత వారంలో నిర్వహించిన ఓ వివాహానికి వందల సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇంకా ఖమ్మం నడిబొడ్డున ఉన్న శాంతి కాలేజి సమీపంలోని మరో ఫంక్షన్‌ హాలులో కూడా శుభకార్యాలు జరుగుతునే ఉన్నట్టు చెబుతున్నారు.

news18-telugu
Updated: August 3, 2020, 7:21 PM IST
ఖమ్మంలో కోవిడ్ వ్యాప్తి కేంద్రాలుగా ఫంక్షన్ హాల్స్..ప్రజాప్రతినిధుల సాక్షిగా రూల్స్ బ్రేక్
ఖమ్మంలో ఫంక్షన్ హాల్ ముందు బ్యానర్
  • Share this:
ఓ వైపు కమ్యూనిటీ స్ప్రెడ్‌గా రూపాంతరం చెందిన కరోనా మహమ్మారి విశృంఖల విన్యాసం చేస్తూ జనహననం చేస్తున్నా.. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య వేలకువేలు పెరుగుతూ ఉన్నా.. జనానికి లెక్కలేదా..? అసలు భయమే లేదా..? అవునన్నట్టే ఇక్కడ కొందరు వ్యవహరిస్తున్నారు. కోవిడ్ నిబంధనల పేరిట ఆగస్టు 31 దాకా ఎక్కడా ఎలాంటి జనసమ్మర్ధ కార్యక్రమాలు నిర్వహించరాదని.. ఫంక్షన్‌ హాళ్లు లాంటి వాటిని తెరవొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధించినా ఖాతరు చేయడం లేదు. వీలైనంత మేరకు గుంపులుగా ఉండే పరిస్థితిని తప్పించుకుంటేనే కరోనా వైరస్‌ నియంత్రణ సాధ్యమన్నది అటు సైంటిస్టులు.. ఇటు ప్రభుత్వాలు చెబుతున్న మాట. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో పెళ్లిళ్లకు మాత్రం 50 మందికి మించకుండా.. అదీ ముందస్తుగా సంబంధిత తహశీల్దార్‌ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఆ తంతు జరిపించాలి. ఇక చావులు లాంటి కార్యక్రమాలకు కూడా కేవలం 20 మందికి మించరాదన్నది నిబంధన.ప్రజా ప్రతినిధుల సాక్షిగా కోవిడ్ నిబంధనలు బేఖాతర్...
అయినా జనం మాత్రం ఏ మాత్రం లెక్కచేయడం లేదు. ఖమ్మం నగంరలోని కొన్ని ఫంక్షన్‌ హాళ్ల యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోవడం లేదు. పైగా ఆయా కార్యక్రమాలకు వందల సంఖ్యలో హాజరవుతున్న పరిస్థితి. కొన్ని ఫంక్షన్‌ హాళ్ల యాజమానులు మరింత ముందుకెళ్లి ప్రభుత్వ నిబంధనలంటూ తమదైన శైలిలో నిబంధనలను మార్చేస్తున్నారు. 200 మందికి మించి హాజరుకావద్దని నిబంధనలకు కొత్త భాష్యం చెబుతున్నారు. బైపాస్‌ రోడ్‌లో ఓ ఫంక్షన్‌ హాల్‌ వద్ద గత వారంలో నిర్వహించిన ఓ వివాహానికి వందల సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇంకా ఖమ్మం నడిబొడ్డున ఉన్న శాంతి కాలేజి సమీపంలోని మరో ఫంక్షన్‌ హాలులో కూడా శుభకార్యాలు జరుగుతునే ఉన్నట్టు చెబుతున్నారు. అయినా ఎవరూ ప్రశ్నించిన పాపాన పోవడం లేదు. నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండగా.. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా హాజరవుతుండడం దీనికి మరికొంత ఊతం ఇస్తోంది.లక్షణాలు లేకపోవడంతో పొంచి ఉన్న ప్రమాదం...
చాలా మందిలో కోవిడ్ వైరస్‌ ఉన్నా అసింప్టమాటిక్‌ (లక్షణాలు కనిపించకపోవడం) కావడంతో తీవ్రత తెలియక వారు జనంలో కలియతిరుగుతున్నారు. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఓ ప్రముఖుని ఇంటిలో చిన్నపాటి శుభకార్యం జరిపారు. తొలుత కుటుంబ సభ్యుల వరకే అనుకున్నా, తీరా దగ్గరి బంధువులు, క్లోజ్‌ ఫ్రెండ్స్‌ పేరిట, ఇరుగు పొరుగు పేరిట చూస్తూ చూస్తూనే రెండొందల మంది దాటారు. ఇక ఒకచోట గుమిగూడాక ఎంత జాగ్రత్తగా ఉన్నా, కలిసి తినాల్సిందే .. మనవాళ్లే కదా.. అన్నట్టు మాస్కులు తీసేసి మరీ ముచ్చట్లు పెట్టడంతో.. ఓ వారం తర్వాత వారిలో ఒకరికి పాజిటివ్‌గా నిర్థరణ అయింది. ఇక ఆ ఫంక్షన్‌కు హాజరైన అందరికీ టెన్షన్‌ పట్టుకుంది. అందరూ టెస్ట్‌లకు పరిగెత్తారు. నానా హైరానా పడ్డారు. ఇప్పటికీ ఎప్పుడు ఎలాంటి ఎస్‌ఎంఎస్‌ వస్తుందోనన్న బెంగతో కునారిల్లిపోతున్నారు. పైగా తొలిరోజుల్లోలా వైరస్‌ వ్యాప్తిని ట్రాక్‌ చేసే పరిస్థితి కూడా లేదు.

కోవిడ్ నిబంధనలకు ఫంక్షన్ హాళ్ల తిలోదకాలు...
ఫంక్షన్‌ హాళ్లు అద్దెకు ఇవ్వడం లాంటి వ్యవహారం దీన్ని మరింత ప్రమాదకరమైన స్థితికి నెడుతోంది. కరోనా వైరస్‌ వల్ల చాలామంది వ్యాపారాలు దెబ్బతిన్నట్టుగానే ఫంక్షన్‌ హాళ్ల యజమానులు కూడా నష్టపోతున్నారు. పనిచేసేవారికి జీతాలు ఇవ్వడం, కరెంటు బిల్లులు లాంటి మినిమం మెయింటెనెన్స్‌ కష్టంగా మారింది. ఫంక్షన్‌ హాల్‌ పెద్దదేగా, దూరం దూరం ఉండొచ్చుకదా అని చాలా మంది తీవ్ర భరోసా ప్రదర్శిస్తున్నారు. ఈ అజాగ్రత్తే ప్రాణం మీదకు తెస్తోంది. గుర్తించేలోగా నష్టం జరిగిపోతోంది. దీన్ని సమర్థంగా నివారించాల్సిన, నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన యంత్రాంగం ఆమేరకు స్పందించడం లేదు.

ఖమ్మంలో ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు తీరిది...
ఖమ్మంలో కొన్ని ఫంక్షన్‌ హాళ్లు కోవిడ్‌ నిబంధనలు అమలు చేయకపోవడంపై సామాన్య ప్రజానీకం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎవరో ఒకరిద్దరు చేసిన కక్కుర్తి పనులకు అమాయకులు బలయ్యే పరిస్థితి తేవొద్దన్న చర్చ జరుగుతోంది. దీనిపై సోషల్‌మీడియాలో ఖమ్మం మునిసిపల్ ‌కార్పోరేషన్‌ అధికారులపై తీవ్ర విమర్శలు రావడంతో ఆఘమేఘాలపై నష్ట నివారణ చర్యలకు దిగారు. గతవారంలో ఫంక్షన్లకు అనుమతి ఇచ్చిన రెండింటిని సీజ్‌ చేసి, ఆమేరకు సోషల్‌ మీడియాలోనే ప్రకటించారు. అయితే ప్రభుత్వ నియమ నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచిచూడాలి.
Published by: Krishna Adithya
First published: August 3, 2020, 7:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading