బీఆర్ఎస్ లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒడిశా మాజీ ఎమ్మెల్యే అర్జున్ దాస్ శనివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. జాజ్ పూర్ నుంచి భువనేశ్వర్ కు బైక్ పై వెళ్తున్న క్రమంలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీనితో మాజీ ఎమ్మెల్యే అక్కడిక్కడే మృతి చెందారు. కాగా అర్జున్ దాస్ 1995 నుంచీ 2000 వరకు బింజర్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శాసనసభ్యునిగా ఉన్నారు. ఇటీవల అర్జున్ దాస్ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఇక అర్జున్ దాస్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీఆర్ఎస్ లో చేరిన కొద్దిరోజులకే అర్జున్ దాస్ మృతి చెందడంతో బీఆర్ఎస్ లో విషాదం నెలకొంది.
ఇదిలా ఉంటే..టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై సీఎం కేసీఆర్ (CM KCR) దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మొదటగా తెలంగాణ చుట్టు పక్కల ఉండే రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఏపీ బాధ్యతలను తోట చంద్రశేఖర్ (Thota Chandra sekhar)కు అప్పగించారు. అలాగే ఇప్పుడు చుట్టు పక్కల రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఒడిశా, కర్ణాటక, కేరళ , మహారాష్ట్ర నుంచి చేరికలు ప్రోత్సహిస్తున్నారు. ఇక రేపు మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో భారీగా చేరికలు ఉండనున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర ఆర్థికంగా నిలదొక్కుకున్న రాష్ట్రమని.. మహారాష్ట్ర కంటే తెలంగాణ బలహీనమైనదని గతంలో కేసీఆర్ అన్నారు. గతంలో తెలంగాణ నుంచి ఉపాధి కోసం మహారాష్ట్రకు వలస వెళ్లే వారని.. ఇప్పుడు వలస వెళ్లిన ప్రజలు వెనక్కి వస్తున్నారని చెప్పారు. తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామని.. మరి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావడం లేదని కేసీఆర్ అక్కడి ప్రజలకు బహిరంగ సభలో తెలియజేయనున్నారు.
జనవరి 27న ఒడిశా నుంచి BRSలోకి భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో ఒడిశా మాజీ మంత్రి శివరాజ్ పాంగి, హేమ గమాంగ, జయరామ్ పాంగి, రామచంద్ర హన్సద, బృందాబన్ మాఝి, నబిన్ నందా, రతా దాస్, భగీరథ్ శెట్టి, మయాధర్ జేనా, అర్జున్ దాస్ తదితరులు ఉన్నారు.
ఈ చేరికల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గిరిధర్ గమాంగ్‌పై ప్రశంసలు కురిపించారు. రైతుల సమస్యలపై ఆయన అనేక పోరాటాలు చేశారని, దేశంలోని క్రియాశీల నాయకుల్లో గమాంగ్ ఒకరని అన్నారు. అలాంటి వారు బీఆర్ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.