Karimnagar: ‘పెళ్లి పేరుతో మోసం’.. కరీంనగర్ మాజీ బీజేపీ అధ్యక్షుడు అరెస్ట్

సత్యనారాయణ

కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళను సహజీవనం పేరిట మోసం చేశారన్న ఆరోపణలపై అరెస్టు చేశారు.

  • Share this:
    కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళను సహజీవనం పేరిట మోసం చేశారన్న ఆరోపణలపై ఆయనను కరీంనగర్ టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడాదిగా సత్యనారాయణరావు తనతో సహజీవనం చేశారని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట తప్పారని ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు స్పందించారు. బాస సత్యనారాయణపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడిని కోర్టులో హాజరు పర్చగా, అక్టోబరు 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

    కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సత్యనారాయణరావు ఓ మహిళా కార్యకర్తతో సన్నిహితంగా ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ వీడియోనే ఆయన కొంపముంచింది. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన, అనైతిక ప్రవర్తనగా భావించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల కింద బాస సత్యనారాయణను కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలను గంగాడి కృష్ణారెడ్డికి అప్పగించారు.

    బాస సత్యనారాయణ రావు తనను మోసం చేశారని ఆరోపిస్తూ ఇటీవల బాధితురాలు మాట్లాడిన కొన్ని వీడియోలు కరీంనగర్‌లో కలకలం రేపాయి. తానూ ఓ బీజేపీ కార్యకర్తనే అని ఆ వీడియోలో ఆమె పేర్కొంది. సత్యనారాయణ రావు మోసం చేశారని పోలీసులకు చెప్పినా పట్టించుకోవట్లేదని వీడియోలో ఆమె ఆరోపించింది. తాను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడానికే ఇదంతా చేస్తున్నానంటూ కొందరు చేసిన ఆరోపణలను ఆమె ఖండించింది. తన వీడియోలు, ఆడియోలు ఉన్నాయని సత్యనారాయణ తనను బెదిరిస్తున్నారని, ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరింది బాధితురాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తోనూ బాధితురాలు మాట్లాడినట్లుగా ఓ వీడియో వెలుగుచూసింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎంపీకి వివరించిన బాధితురాలు... తనకు న్యాయం చేయాలని కోరింది. బాస సత్య నారాయణ రావు వ్యవహారం కరీంనగర్ జిల్లా రాజకీయంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

    బీజేపీలో జిల్లా అధ్యక్షుడి స్థాయి నేత రాసలీలల వ్యవహరం బయటకు రావడం సంచలనంగా మారింది. కరీంనగర్ కు చెందిన  నాయకుడు మహిళా కార్యకర్తలతో రాసలీలు సాగించిన వీడియో, ఆడియోలు బయటకు వచ్చాయి. ఓ మహిళా కార్యకర్తకు పదవులు ఇప్పిస్తాడని లోబర్చుకుని ఆమెతో తన కామ కోరికలను తీర్చుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. మోజు తీరాక వద్దనడంతో ఆ మహిళా కార్యకర్త ఆ నాయకుడి బండారాన్ని బయటపెట్టింది. ఆ మహిళా కార్యకర్తతో సదరు నాయకుడు చేసిన కామక్రీడలు వెలుగులోకి వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ నాయకుడి వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారింది. వెంటనే అతడిని తప్పించి కరీంనగర్ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించడం ద్వారా బీజేపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: