పులి.. పేరు వినగానే అందరూ గజగజ వణుకుతారు.. కానీ నిజానికి పులి ఎదురుపడితే భయపడకుండా నిటారుగా నిల్చోగలిగితే అది ఏం చేయదంటున్నారు అటవీశాఖ ఉన్నతాధికారులు. పులిని చూసి మనం ఎలాగైతే భయపడుతున్నామో.. అలాంటి భయానికి పులిని గురిచేయకుండా.. మన వైపునుంచి దానికి ప్రమాదం ఉందన్న సంకేతాలను ఇవ్వకుండా ఉంటే చాలంటున్నారు. కానీ ఇది ప్రాక్టికల్‌గా సాధ్యమా అంటే అయ్యే పనే కాదు. ఎందుకంటే అది పులి. దానికి భయమేసినా.. ఆకలేసినా మన పని ఖతమే మరి. నిజానికి గత కొన్ని వారాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహా తెలంగాణలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లోని మండలాల్లో పులి జాడ ఎక్కువగా కనిపిస్తోంది. పొలానికి వెళ్లిన రైతులకు తారసపడడం.. రాత్రి పూట ప్రయాణిస్తున్న వ్యక్తులకు రోడ్డు దాటుతూ కనిపించడం.. ఒక చోట ఆవును తిన్న ఆనవాళ్లు దొరకడం.. కొన్ని చోట్ల మనుషులపైన దాడి చేసిన సందర్భాలు కూడా నమోదయ్యాయి. వాస్తవానికి వాటికి పూర్తి భద్రత ఉండే అడవిని దాటి పులులు బయటి ప్రపంచంలోకి ఎందుకొస్తున్నాయన్నది పెద్ద ప్రశ్న.
మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఉన్న తిప్పేశ్వర్ టైగర్ శాంక్చువరీ, అలాగే చత్తీస్‌ఘడ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ప్రాంతాలలో పులుల సంఖ్య క్రమేణా పెరగడం.. వాటికి సరిపోయినంత విస్తీర్ణంలో రిజర్వ్ టైగర్ జోన్లు లేకపోవడంతో పులులు ఆవాసాలు వెతుక్కుంటూ బయటకు వస్తున్నట్టు అటవీశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నిజానికి భౌగోళిక సరిహద్దులు మనుషులకే గానీ, అడవుల్లో ఉండే పులులకు ఉండే పరిస్థితి లేదు. కానీ పులులు వాటికి ఏది సురక్షితమైన ప్రదేశమో పదే పదే వెతుక్కుని మరీ ఎంపిక చేసుకుంటాయి. దీంట్లో భాగంగానే కొన్ని కొన్ని సార్లు ప్రజలకు కనిపించడం.. అప్పుడప్పుడూ దాడులు చేయడం.. ఆకలేసిన సమయంలో జంతుజాలంపై పడి తినేయడం జరుగుతుంటుంది.
అయితే కొన్ని ప్రాంతాల్లో పులికి భయపడి వలలు బిగించడం.. విద్యుత్ వైర్లతో ఫెన్స్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇది పులికి, అదే సమయంలో అటుగా ప్రయాణించే వేరే జంతువులు, కొన్ని సార్లు మనుషులకు కూడా ప్రాణాంతకంగా మారుతున్న సందర్భాలను చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో ఆళ్లపల్లి, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, అశ్వాపురం, పాల్వంచ, మణుగూరు, పినపాక, బూర్గంపాడు, జూలూరుపాడు, గుండాల మండలాల్లోని మారుమూల ఏజెన్సీ పల్లెల్లో ప్రజలు భయంభయంగా రోజులు గడుపుతున్నారు. ఎప్పుడు పులి వచ్చి ఊరిమీద పడుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. పత్తి, మిరప పంటలకు సీజన్ కావడంతో పొలానికి వెళ్లాలన్నాభయం వెంటాడుతోంది. దీంతో కొందరు సమూహంగా వెళ్తూ, తప్పెట్లతో పెద్దపెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరికొందరు తల వెనుక వైపు మాస్క్ ధరించి ఒకవేళ పులి వస్తే దాని దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా పులి పేరు వింటేనే జనం వణికిపోతున్న సందర్భంలో అటవీశాఖ తరపున ప్రజలకు అవగాహన, చైతన్యం తెచ్చే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
భద్రాద్రి జిల్లా ఏజెన్సీలోని పరిస్థితులపై కొత్తగూడెం వైల్డ్ లైఫ్ ఎఫ్‌డీవో దామోదర్‌రెడ్డిని 'న్యూస్18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధి సంప్రదించగా.. ఇప్పటికే 13 బృందాలను ఏర్పాటు చేశామని, వీరంతా రోజువారీ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ప్రజల్లో భయాందోళనలను తగ్గించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే వన్యమృగాలకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, వాటికోసం ఉచ్చులు వేయడం, కరెంటు పెట్టడం లాంటివి చేయొద్దని చెప్పారు. పులి సంచారం ఉందని సమాచారం ఉన్న అన్ని గ్రామాలను తమ బృందాలు సందర్శిస్తున్నాయని, భయపడాల్సిన పని లేదన్నారు.
గత వారంలో తనకు కొద్ది నిమిషాల తేడాలో పులి మిస్ అయిందని, ఒకవేళ ఎవరికైనా అనుకోని పరిస్థితుల్లో పులి తారసపడితే 'కదలకుండా నిటారుగా నిల్చుంటే అది ఏమీ చేయదని.. తీక్షణంగా పులి వైపు చూడకుండా సాధారణంగా చూడాలని.. అప్పుడు మన నుంచి దానికి ప్రమాదం లేదని గ్రహించి దూరం నుంచే వెళ్లిపోతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పులికి వీపు చూపొద్దని దామోదర్‌రెడ్డి చెప్పారు. శాస్త్రీయంగా ప్రూవ్ అయిన ఈ విషయాలను తాను ప్రస్తావిస్తున్నానని, నిజానికి ఎవరికైనా పులి తారసపడితే ఆ పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదన్నారు. సమీప గ్రామాల రైతులు డప్పుల చప్పుళ్లు చేయడం ఫలితాన్నిస్తోందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Forest, Tiger