Flood Relief Fund: వరద బాధితులకు ఎంత కష్టం... రూ.10 వేల కోసం తిప్పలు పడుతున్న జనం

వరద బాధితులకు ఎంత కష్టం (credit - twitter)

Flood Relief Fund in Telangana: తెలంగాణ ప్రభుత్వం... హైదరాబాద్ వరద బాధితులకు ప్రకటించిన ఆర్థిక సాయం... బాధితులను మీసేవ కేంద్రాల చుట్టూ పరుగులు పెట్టేలా చేస్తోంది.

 • Share this:
  Flood Relief Fund: తెలంగాణ... హైదరాబాద్‌లో భారీ వరదలు రావడంతో... ముంపు ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సాయం ప్రకటించింది. కొంత మందికి ఆర్థిక సాయాన్ని ఇచ్చింది కూడా. ఐతే... ఇంకా చాలా మందికి సాయం అందలేదు. ఇంతలో GHMC ఎన్నికల ప్రకటన రావడంతో... ఇప్పుడు చేతికి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. ఆన్‌లైన్ బ్యాంక్ అకౌంట్లలో మనీ జమ చెయ్యాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి బాధితులు మీసేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మూడ్రోజులుగా మీసేవ కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. ఎంతలా అంటే... చాలా చోట్ల సర్వర్లు మొరాయిస్తున్నాయి. కొన్ని చోట్ల జనం ఎక్కువైపోయారంటూ.. మీసేవ నిర్వహకులు... కేంద్రాన్ని మూసేసి వెళ్లిపోతున్నారు. ఇంకొన్ని చోట్ల... రేపు రండి... ఎల్లుండు రండి అంటూ... తిప్పి పంపిస్తుంటే... రోజంతా ఎదురుచూస్తున్న బాధితులకు నిరాశే ఎదురవుతోంది.

  తోపులాటలు, సమస్యలు:
  భాగ్ అంబర్‌పేటలో రూ.10వేల వరద ఆర్థిక సాయం కోసం మీసేవ సెంటర్‌కు వేల మంది బాధితులు చేరుకున్నారు. క్యూ లైన్లలో తోపులాటలతో మహిళలు, ముసలివారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వేలా మంది చేరుకోవడంతో... వారిని అదుపు చెయ్యడం పోలీసుల వల్ల కావట్లేదు.

  కరోనా సమయంలో కష్టమే:
  నిజానికి బహిరంగ ప్రదేశాల్లో సేఫ్ డిస్టాన్స్ పాటించాలని ప్రభుత్వమే ఆదేశించింది. కానీ... మీ సేవ కేంద్రాల దగ్గర ప్రజలు సేఫ్ డిస్టాన్స్ పాటించేలా ఏర్పాట్లు లేవు. వందలు, వేలల్లో వస్తున్నవారు... గ్యాప్ లేకుండా నిల్చోవాల్సి వస్తోంది. దాంతో... ఎవరి నుంచి ఎవరికి కరోనా సోకుతుందో అనే భయం తమను వెంటాడుతోందని బాధితులు చెబుతున్నారు.
  వరదల సమయంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు బాధితులకు స్వయంగా ఆర్థిక సాయం ఇచ్చారు. కొన్ని చోట్ల సాయం అందడంలేదని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సొమ్మును కొందరికి మాత్రమే ఇచ్చారని బాధితులు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సాయం అందని వారు మీ సేవ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించింది.  ఇది కూడా చదవండి: Amaravati: ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకోవాలా... ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

  మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న బాధితులు బుధవారం కూడా మీ సేవ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. చలిని కూడా లెక్కచేయకుండా తెల్లవారుజామున 4గంటల నుంచే బారులు తీరారు. నగరంలోని ఎల్బీనగర్‌, వనస్థలిపురం, సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండి, శేరిలింగంపల్లి పరిధిలో, అంబర్‌పేట గోల్నాకా, చందానగర్‌, సనత్‌నగర్‌, మారేడ్‌పల్లి, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి పరిధిలోని మీ సేవ కేంద్రాలకు మహిళలు, ముసలివారు భారీగా తరలి వచ్చారు. సిటీలోని చాలా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి వాటితో ఎదురుచూస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకున్న మర్నాడే నగదు వారి ఖాతాల్లో జమ అవుతోందన్న సమాచారంతో బాధితులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. డిసెంబరు 1న GHMC ఎన్నికలు కూడా ఉండటంతో కచ్చితంగా వరద సాయం అందుతుందని బాధితులు ఆశతో ఉన్నారు. కాకపోతే... ఇలా మూడు రోజులుగా తాము చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని వారంటున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: