news18-telugu
Updated: September 18, 2020, 10:03 AM IST
శ్రీశైల డ్యామ్
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. భారీ వానలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక్కడ కురిసే వర్షాలకు తోడు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో.. కృష్ణా నది మహోగ్రరూపం దాల్చింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండడంతో డ్యామ్‌ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉండడంతో వరద ఉద్ధృతి ఇలాగే కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జూరాల జలాశయానికి శుక్రవారం ఉదయానికి లక్షా 18 క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తోంది. వరద మరింత పెరిగే అవకాశ ఉండటంతో అధికారులు ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి లక్షా 21 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా.. ప్రస్తుతం 1044 అడుగులు ఉంది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.810 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి.
జూరాల నుంచి శ్రీశైలానికి వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగులు మేర ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి 1,50,437 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 2,55,433 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.807 టిఎంసీలు కాగా.. ప్రస్తుత 210.9946 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 8 క్రస్టుగేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు 1,55,291 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుండగా.. ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీల నీరుంది.
Published by:
Shiva Kumar Addula
First published:
September 18, 2020, 9:06 AM IST