Home /News /telangana /

FLOATING SOLAR PLANT WILL BE SET UP SOON IN PEDDAPALLI DISTRICT OF TELANGANA SNR PSE NJ

Floating Solar Plant‌: నీళ్లపై విద్యుత్‌ ఉత్పత్తి పలకలు..భళా ఏంటీ వండర్

(ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్)

(ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్)

Floating Solar Plant‌: మీరెప్పుడైనా ఫ్లోటింగ్ సోలార్ ఫ్లాంట్‌ని చూశారా..? అదేంటి సోలార్ ఫ్లాంట్ అంటే ఏ పొలాల్లోనో…ఖాళీ స్థలాల్లోనో… ఇంటి మిద్దెల మీదనో ఉండటం చూశాం…కానీ ఫ్లోటింగ్ సోలార్ ఫ్లాంట్ ఏంటి? అని ఆశ్చర్యపోవద్దు ఇప్పుడు అది మన తెలంగాణలోనే ఉంది. ఎక్కడంటే..

ఇంకా చదవండి ...
  (E. Santosh, News18, Peddapalli)

  తెలంగాణలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్ త్వరలో తెలంగాణలో ప్రారంభం కానుంది. పెద్దపల్లి(Peddapalli)జిల్లా రామగుండం(Ramagundam) వద్ద ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ రిజర్వాయర్లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో 450 ఎకరాలలో విస్తరించి ఉన్న సోలార్ ఫోటో-వోల్టాయిక్ ప్రాజెక్టులో 4.5 లక్షల సోలార్ ప్యానెల్స్‌ ఉంటాయి. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించనున్నట్లుగా తెలుస్తోంది. కేరళలోని కయంకుళం గ్యాస్ ప్లాంట్లో 92 మెగావాట్ల ఫ్లోటింగ్ యూనిట్… విశాఖపట్నం(Visakhapatnam)లోని సింహాద్రి విద్యుత్ ప్లాంట్లో 25 మెగావాట్ల యూనిట్ను కూడా( NTPC) ఏర్పాటు చేస్తోంది. కేరళ(Kerala)లోని కయంకుళం(100KW)గుజరాత్‌ (Gujarat)లోని కవాస్ (1 MW) వద్ద పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత…మరికొన్ని చోట్ల ఈ తేలియాడే సౌర ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి NTPC నిర్ణయించింది. 100 గిగావాట్ల సౌర వ్యవస్థాపక సామర్థ్యంతో … 2022 నాటికి 175 గిగావాట్ల వ్యవస్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పడబోతుందని అధికారులు చెబుతున్నారు.

  ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం..
  నీటి వనరులు.. భారీ జలాశయాలపై తేలియాడే సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయడం వల్ల ఖర్చులను తగ్గించవచ్చని ఎన్టీపీసీ అధికారులు వివరిస్తున్నారు. ఫ్లోటింగ్ సోలార్ యూనిట్లు గ్రౌండ్-మౌంటెడ్ ప్లాంట్‌లతో పోల్చినప్పుడు తక్కువ ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు. దక్షిణ భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రధాన జలాశయాలు ఉన్నందున తేలియాడే సౌర ప్లాంట్లపై దృష్టి పెట్టాలని NTPC యోచిస్తోంది. తేలియాడే ప్లాంట్ల వల్ల ప్రయోజనాలున్నాయని కంపెనీ అధికారులు చెబుతున్నారు. భూమిపై ఒక మెగావాట్ల సోలార్ ఫోటో-వోల్టాయిక్ ప్లాంట్ ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమి అవసరం. పైగా భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకోవడంలో సవాళ్లు ఉంటాయి. ఈ తేలియాడే పద్ధతి కోసం ప్రాజెక్టులు రిజర్వాయర్ లపై ప్రభుత్వమే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉచితంగా ఏర్పాటు చేసుకోవచ్చు.

  వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ..
  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ 600 మెగావాట్ల సౌర శక్తి ప్రాజెక్టు భారతదేశంలో కూడా రాబోతోంది. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలోని నర్మదా నదిపై ఓంకరేశ్వర్ ఆనకట్ట వద్ద నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2022-23 నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. ఆనకట్టలో సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 2 వేల హెక్టార్ల నీటి ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. జలాశయంలోని నీటి ఉపరితలంపై ఈ సౌర ఫలకాలు తేలుతాయి.

  తేలియాడే సోలార్ తో గ్రీన్ ఎనేర్జి ఉత్పత్తి ..
  రామగుండంలో తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుతో తెలంగాణలో మొత్తం పునరుత్పాదక ఇంధన వాటా సామర్థ్యం 3944 మెగావాట్లుకు చేరుతుంది. 2022 పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరుకోవడంలో తెలంగాణ కూడా ముందుంటుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా NTPC తన కార్బన్ ఉద్ఘారాలను తగ్గించి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచి దాని సామర్థ్యంలో 30 శాతానికి పరిమితం చేయాలనే ప్రణాళికలో భాగంగా వీటిని నిర్మిస్తోంది..

  అనుగూణంగా ఉండే ప్రాంతాలు..
  రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌ ఎక్కువగా మహబూబ్‌నగర్ , నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో అవకాశం ఉంది. మిగతా చోట్ల కంటే ఈ ప్రాంతాల్లో ఎండ వేడి అధికంగా ఉంటుంది. ఫలితంగా ఎక్కువ సోలార్ ప్లాంట్లు ఈ ప్రాంతంలోనే ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తం గా సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు టెండర్లు పిలిచింది. ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న టైమ్‌లో యూనిట్‌కు రూ.6.49 చొప్పున టెండర్లు పిలవగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక రెండు సార్లు టెండర్లు పిలిచారు. ఆశావహుల నుంచి స్పందన బాగానే ఉన్నా, స్థలం కొరత కారణంగా ప్లాంట్ల నిర్మాణం లో ఆశించిన వేగం కనిపించ లేదు.విదేశాల్లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పై జలమంధన్‌లో స్వల్పకాల చర్చ కూడా జరిగింది. జల వనరులపై జాతీయ స్థాయిలో జల మంధన్ పేరుతో ఉన్నత స్థాయి సమావేశం ప్రతి ఏటా న్యూఢిల్లీలో నిర్వహిస్తుంటారు. దీంత రాష్ట్రంలో కూడా ఈ వినూత్నయత్నంపై దృష్టి పెట్టాలన్న ప్రభుత్వ సలహాదారుల సూచనలతో ఇంజనీర్లను నియమించారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి లభ్యత, అలల తీవ్రత, విస్తీర్ణం, డెడ్స్టోరేజి, సమీపంలో ఉన్న సబ్స్టేషన్ వివరాలు, పరిసర గ్రామాలలో విద్యుత్ డిమాండ్, ఇతరత్రా సమాచారాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పర్యటించి, తుది నివేదిక తయారు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో కనీసం 5 నుంచి 6 వేల చెరువులు ఫ్లోటింగ్ ప్లాంట్లకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలు అమలైతే తెలంగాణ ఖ్యాతి ప్రపంచదేశాల్లో మారుమోగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: PEDDAPALLI DISTRICT, Solar

  తదుపరి వార్తలు