ఆర్టీసీ సమ్మె 35వ రోజుకు చేరుకున్న తరుణంలో.. కోరుట్ల డిపో పరిధిలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ఉద్యోగి విధుల్లో చేరడాన్ని నిరసిస్తూ ఆమె ఫోటోకు చెప్పుల దండ వేసినందుకు పోలీసులు ఐదుగురు కార్మికులపై కేసు నమోదు చేశారు. కార్మికులు సమ్మె వదిలి విధుల్లో చేరాలన్న సీఎం కేసీఆర్ పిలుపుతో.. జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన మెకానికల్ ఫోర్‌మెన్ సంధ్యారాణి విధుల్లో చేరారు. దీంతో ఆమె తీరును వ్యతిరేకిస్తూ గురువారం మధ్యాహ్నం కోరుట్ల డిపో ముందు సంధ్యారాణి ఫోటో ఫ్లెక్సీ బ్యానర్‌కు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు కొందరు కార్మికులు. వారిలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ జీబీ సింగ్, బాలరాజు, అంజలి, జ్యోతి, ప్రభాకర్, ఎలక్ట్రిషన్ చిరంజీవి, పీఎల్ నారాయణ, డ్రైవర్ ప్రభాకర్ ఉన్నారు. సంధ్యారాణి విధులకు హాజరవడాన్ని నిరసిస్తూ ఆమె ఫోటోను బ్యానర్‌పై ముద్రించి చెప్పులతో కొట్టారు. అనంతరం ఆ ఫొటోకు చెప్పుల దండ వేశారు. ఘటనపై మనస్తాపం చెందిన సంధ్యారాణి.. తనను అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో ఈ ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ఆర్టీసీ సమ్మెపై విచారణ చేస్తున్న హైకోర్టు వాదనలను ఈ నెల 11కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలపై అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తులు.. ఇన్ని అబద్ధాలు చెబుతారా? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. కేంద్రం తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు.. ఏపీఎస్ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని చెప్పారు. టీఎస్ ఆర్టీసీకి చట్టబద్ధత లేదని, అలాంటప్పుడు 33 శాతం వాటా ప్రశ్నే తలెత్తే అవకాశం లేదని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీలోనే కేంద్రానికి 33 శాతం వాటా ఉందని వివరించారు. ఈ ఘటనలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్చర్యం కలిగించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, GHMC, Telangana High Court, Tsrtc privatization, TSRTC Strike