హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka By election Result: దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి 5 కారణాలు

Dubbaka By election Result: దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి 5 కారణాలు

కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)

కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)

Dubbaka By election Result: 2018 సాధారణ ఎన్నికల్లో 60 వేలపైగా ఓట్ల మెజార్టీతో దుబ్బాకలో గెలిచిన టీఆర్ఎస్... ఇప్పుడు ఉప ఎన్నికల్లో అదే స్థానాన్ని అప్పుడు మూడో స్థానంలో ఉన్న బీజేపీకి కోల్పోయింది.

    దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌పై బీజేపీ అనూహ్య విజయం తెలంగాణలో సరికొత్త సమీకరణాలకు దారి తీస్తుందని రాజకీయవర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. 2018 సాధారణ ఎన్నికల్లో 60 వేలపైగా ఓట్ల మెజార్టీతో దుబ్బాకలో గెలిచిన టీఆర్ఎస్... ఇప్పుడు ఉప ఎన్నికల్లో అదే స్థానాన్ని అప్పుడు మూడో స్థానంలో ఉన్న బీజేపీకి కోల్పోయింది. సాధారణంగా ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో టీఆర్ఎస్ దిట్టగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి టీఆర్ఎస్ కేసీఆర్ సొంత జిల్లా, టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావు పర్యవేక్షించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోవడం టీఆర్ఎస్ ఊహించని షాక్ అనే చెప్పాలి. అయితే అసలు దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.


    టీఆర్ఎస్ అతివిశ్వాసం

    దుబ్బాక ఉప ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామని టీఆర్ఎస్ అతి విశ్వాసంతో వ్యవహరించిందనే వాదన ఉంది. తాము లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని.. బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఓ వైపు బీజేపీ శ్రేణులంతా దుబ్బాకలో తిష్ట వేసి ప్రచారం చేస్తే.. టీఆర్ఎస్ తరపున మాత్రం ఒక్క హరీశ్ రావు మాత్రం భారమంతా మోశారు.

    సోలిపేట కుటుంబంపై వ్యతిరేకత

    సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే.. ఆ కుటుంబానికి చెందిన వారికే సీటు ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. టీఆర్ఎస్ కూడా అదే చేసింది. అయితే సోలిపేట రామలింగారెడ్డి విషయంలో దుబ్బాక ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదనే టాక్ ఉంది. సోలిపేట రామలింగారెడ్డి కుమారుడిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించిన టీఆర్ఎస్.. రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్ ఇవ్వడం ద్వారా దానిని అధిగమించవచ్చని యోచించింది. కానీ టీఆర్ఎస్ అనుకున్నట్టు జరగలేదు.

    మల్లన్నసాగర్ ముంపు బాధితుల అసంతృప్తి

    దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయానికి, బీజేపీ విజయానికి మరో కారణం మల్లన్నసాగర్ ముంపు బాధితుల్లో ఉన్న అసంతృప్తి అనే ప్రచారం కూడా ఉంది. సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ముంపు బాధితులకు ఇచ్చిన పరిహారంతో పోలిస్తే దుబ్బాకలో మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ఇచ్చిన పరిహారం చాలా తక్కువ అనే భావన ఉంది. దీన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించింది. పలు మండలాల్లో ఈ అంశంపై బీజేపీ బలంగా ప్రచారం చేయడం.. తమ పార్టీని గెలిపిస్తే న్యాయం చేస్తామని చెప్పడం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది.

    రఘునందన్‌రావుపై సానుభూతి

    దుబ్బాక నుంచి రెండు పర్యాయాలు ఓడిపోయిన రఘునందన్ రావు.. సోలిపేట మరణం తరువాత ఉప ఎన్నికలు ఖాయమనుకుని ముందుగానే రంగంలోకి దిగిపోయారు. తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలోని యువతను దగ్గర చేసుకోవడంలో విజయం సాధించారు. స్వతహాగా మంచి వక్త అయిన రఘునందన్ రావు.. తనదైన ఉపన్యాసాలతో ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు.

    కరోనా, ఎల్ఆర్ఎస్ సహా ఇతర అంశాలు

    తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలు జరిగే సమయానికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో పాటు ఫ్లాట్లు ఉన్నవారంతా ఎల్‌ఆర్ఎస్ చేయించుకోవాలని ప్రభుత్వం నిబంధనల విధించింది. దీనిపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ప్రభావం కూడా దుబ్బాక ఉప ఎన్నికల్లో పడిందనే వాదన ఉంది. మరోవైపు కరోనాను డీల్ చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఈ ఉప ఎన్నికలపై పడి ఉండొచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. వీటితో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాల ప్రభావం కూడా ఈ ఎన్నికలపై పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Dubbaka By Elections 2020, Telangana

    ఉత్తమ కథలు