తెలంగాణలో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అతి ముఖ్యమైన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా మహిళలు, విద్యార్థినులు డిమాండ్ చేస్తూ, రకరకాల రూపాల్లో పోరాటాన్ని కొనసాగించగా ఎట్టకేలకు తెలంగాణలో తొలి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీ ఏర్పాటకు సంబందించి కేసీఆర్ సర్కారు ఇన్నాళ్ల తర్వాత నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోఠిలో ఉన్న ఉమెన్స్ కాలేజీనే మహిళా విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేశారు.
కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేస్తూ ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరం నుంచే మనుగడలోకి రానున్నట్లు పేర్కొన్నారు. నిధులు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు కాలేజీ సిబ్బంది, భవనాలు, ఇతర ఆస్తులను యూనివర్సిటీ పరిధిలోకి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు.
కాగా, ఉన్నత విద్యలో తెలంగాణ మహిళలు ముందంజలో ఉండాలనే లక్ష్యంతో మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుపై సోమవారం తన కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కోఠి ఉమెన్స్ కాలేజీని విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేసిన ఉత్తర్వులను ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విజ్జులతకు అందజేశారు.
త్వరలో వందేండ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి మహిళా కళాశాలను రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దనున్నట్టు ప్రభుత్వం ఉత్తరులు ఇవ్వడంతో ప్రస్తుత, పూర్వ విద్యార్థినులు, విమెన్ వర్సిటీ కోసం పోరాటాలు చేసినవారు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కాలేజీలో దాదాపు 4,159 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వర్సిటీగా మారిన తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Hyderabad, Sabitha Indra Reddy, Telangana, University, Women