FIRST ANNIVERSARY CELEBRATIONS OF DUBBAKA BALAJI TEMPLE IN SIDDIPET DISTRICT SNR MDK
Telangana :శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు .. మరో తిరుమల క్షేత్రమే
dubbaka venkateshwara temple
Telangana : కలియుగ అధిపతి, వైకుంఠక్షేత్రపాలకుడిగా పిలవబడే శ్రీవేంకటేశ్వరస్వామి దుబ్బాకలో భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నారు. దేవదేవుడి ఆలయం నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట జరిపి ఏడాది పూర్తైంది. అందుకే శ్రీనివాసుడి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
(K.Veeranna,News18,Medak)
కలియుగ అధిపతి, వైకుంఠక్షేత్రపాలకుడిగా పిలవబడే శ్రీవేంకటేశ్వరస్వామి తెలంగాణ(Telangana) సిద్దిపేట(Siddipet) జిల్లాలోని దుబ్బాక(Dubbaka)లో భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నారు.ఆ దేవదేవుడి ఆలయం నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట జరిపి ఏడాది పూర్తైంది. ఈసందర్భంగా శ్రీనివాసుడి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆరు రోజుల పాటు సాగే ఈ శ్రీవారి ఆలయ వార్షికోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఆలయం విద్యుత్ దీపాలంకరణ నడుమ ఆధ్యాత్మిక పరిమణాలు వెదజల్లుతోంది.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆలయం..
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బాలాజీగా వెలిశారు. భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న దేవదేవుని ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. శనివారం ఆగస్ట్ 6వ తేది నుంచి 11వ తేది వరకు సుమారు ఆరు రోజుల పాటు శ్రీబాలాజీ ఆలయంలో పంచాహ్నిక ఏకకుండాత్మక ప్రథమ వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఆరు రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రథమ వార్షికోత్సవం నిర్వహించేందుకు శ్రీవేంకటేశ్వర ట్రస్టు అన్నీ ఏర్పాట్లును పూర్తి చేసింది. ఆలయం చుట్టూ విద్యుత్తు దీపాలతో అలంకరణ, లోపల, వెలుపల చలువ పందిళ్లు వేశారు.
9న కల్యాణం, 10న రథోత్సవం..
వార్షికోత్సవాల్లో భాగంగా తొలి రోజు ఆగస్ట్ 6న శనివారం విష్వక్సేనుడి ఆరాధన, పుణ్యాహవాచనం, పల్లకి సేవ, హోమంతో వార్షిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 7న ఆదివారం యాగశాల ప్రవేశం, మూర్తి కుంభారాధన, ధ్వజారోహణం, విష్ణు సహస్త్ర పారాయణం, పూర్ణాహుతి ఉంటుంది. 8వ తేదిన బలి హరణం, మంగళశాసనం, ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 9న సామూహిక లక్ష్మి కుంకుమార్చన, సాయంత్రం వేంకటేశ్వరస్వామి కల్యాణం, 10న శాంతి పఠనం, రథోత్సవం ఉంటుంది. ఆగస్ట్ 11వ తేది నాడు మహాపూర్ణాహుతి, చక్రస్నానం, ధ్వజావరోహణం, సప్తావరణాలు జరుగుతాయి.
ప్రసాద వితరణం..
ఆలయంలో నిర్వహించే ప్రథమ వార్షికోత్సవ వైదిక కార్యక్రమాలన్ని యజ్ఞాచార్యులు అరుణ కుమార్, ప్రధాన అర్చకుడు అచ్చి లక్ష్మీనరసింహాచార్యులు నిర్వహించనున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. బాలాజీ ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ట్రస్టు ప్రధాన కార్యదర్శి చింత రాజు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ప్రసాద వితరణ చేయనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నారు. .
నిత్యకల్యాణం పచ్చతోరణం..
దుబ్బాకలోని శ్రీబాలాజీ ఆలయ నిర్మాణానికి 2009లో శంకుస్థాపన చేపట్టారు. పన్నెండు సంవత్సరాల పాటు అద్భుత శిల్పకళతో నిర్మాణం పూర్తి చేసుకుంది. 2021లో బాలాజీ ఆలయం ప్రారంభమైంది. గతేడాది ఆగస్టు 20న తెలంగాణ ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు సమక్షంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. పద్మావతి, వేంకటేశ్వరస్వామి, గోదాదేవి విగ్రహాల ప్రతిష్ఠలతో ఆలయంలో నిత్యపూజలు, భక్తుల దర్శనాలతో నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లూ వస్తోంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.