కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌లోని(Secunderabad) ఓ షాపింగ్ క్లాంపెక్స్‌లో మంటలు చెలరేగిన ఘటన మరువకముందే మరో షాపింగ్‌లో మంటలు అంటున్నాయి. సికింద్రాబాద్ పాట్నీ, ప్యారడైజ్ సమీపంలోని ప్రముఖ షాపింగ్ కాంప్లెక్స్ అయిన స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని(Swapnalok Complex) పలు అంతస్థుల్లో మంటలు వ్యాపించాయి. 7, 8 అంతస్థుల్లోని గోడౌన్లలో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. మంటల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు భవనంలో ఎనిమిది మంది చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
అయితే ఈ ప్రమాదం కారణంగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు పది మంది వరకు మంటలు అంటుకున్న ఫ్లోర్లలో ఉండగా.. పలువురిని రెస్క్యూ సిబ్బంది కాపాడగలిగారు. బాధితులు ఫోన్ లైట్ ద్వారా తాము ఇక్కడ ఉన్నామని.. తమను కాపాడాలని రెస్క్యూ సిబ్బందిని కోరారు. క్రేన్ సాయంతో ఏడుగురిని సిబ్బంది కాపాడారు. అయితే మరో ఏడుగురు మంటల్లో చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు ఆయా అంతస్థుల్లో ఉన్న ఐరన్ గ్రిల్స్‌ను సిబ్బంది తొలగిస్తున్నారు. బాధితులకు లోపల ఆక్సిజన్ అందడం లేదని.. లోపలికి ఆక్సిజన్ పంపే ఏర్పాట్లు చేయాలని ప్రమాదం నుంచి బయటపడిన వాళ్లు చెబుతున్నారు.
ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడే చెప్పలేమని.. ప్రమాదంలో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని తెలిపారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటల ఉధృతి పెరగడంతో.. లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఏలా ఉందో అని బాధితుల బంధువులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్‌లో వడగండ్ల వాన.. రోడ్డుపైనే ఐస్ గడ్డలు..!
Paper Leak Effect: ఆ పరీక్షలపై TSPSC సంచలన నిర్ణయం
ఇదిలా ఉంటే గత జనవరిలో సికింద్రాబాద్ నల్లగుట్ట దక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ముగ్గురు యువకులు సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది రెండు, మూడు రోజులు శ్రమించిన తరువాత అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. ఈ ఘటన మరువకముందే తాజాగా మరో అగ్నిప్రమాదం జరగడంతో.. దీని తీవ్రత ఎలా ఉంటుందనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Telangana