Hydearabad Rains: జల దిగ్బంధం లోనే విశ్వనగరం.. సరూర్ నగర్ లో ఇంకా తగ్గని వరద

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా నగరమంతా వరదల మయమైంది. రోజూ కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. కాగా, గడిచిన రెండు రోజులుగా వర్షం ఉధృతి కొంచెం తగ్గినా.. ప్రజలకు మాత్రం ఇంకా వరద ఇక్కట్లు తప్పడం లేదు.

  • News18
  • Last Updated :
  • Share this:
    విశ్వనగరం.. విశ్వ నరకం అవుతున్నది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. చెరువులు తెగి, నాళాలు ఉప్పొంగి.. వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యంలో ప్రజలు గల్లంతయ్యారు. వరదనష్టం అంచనా ఇంకా కొలిక్కిరాలేదు. కాగా, రెండ్రోజులుగా వరుణ దేవుడు కాస్తంత శాంతించినా.. వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు. నగరంలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు చెప్పుకోలేని బాధలు అనుభవిస్తునే ఉన్నారు. నగరంలోని సరూర్ నగర్ లో వరదల ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    సరూర్ నగర్ లో ని పలు లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికీ అక్కడ వరద మోకాలిలోతు ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నా.. ప్రజలకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. వరద నీరు ముంచెత్తుతుండటంతో ప్రజలంతా బిల్డింగ్ పైకి ఎక్కి ఆశ్రయం పొందుతున్నారు. బుధవారం రాత్రైనా వరద ప్రవాహం తగ్గలేదు. దీంతో అక్కడున్నవారందరికీ రాత్రంతా జాగరం చేయాల్సి వచ్చింది.

    సరూర్ నగర్ తో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. హిమాయత్ సాగర్ నిండుకుండలా ఉండటంతో.. అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పై నుంచి వరద ప్రవాహం ఇంకా ఎక్కువైతే అక్కడుండే వారికి ప్రమాదమే. ఇంకా పాతబస్తీలోని పలు ఏరియాలో రోడ్లమీద వరద నీరు అలాగే ఉండటంతో.. ప్రజలు బోట్లు, గుర్రాల మీద ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    కాగా, వరదల బారిన పడ్డ హైదరాబాద్ ను ఆదుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు మంచి స్పందన లభిస్తున్నది. హైదరాబాద్‌ను ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు కూడా తమ వంతు సాయం ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ. 10 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించగా.. బెంగాల్ ప్రభుత్వం రూ. 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. బుధవారం రాత్రి ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా రూ. 5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. వీరే గాక సినీనటులు, కార్పోరేట్లు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హైదరాబాద్ వరదబాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.  పలు ఎన్జీవోలు కూడా భాగ్యనగర వాసులను ఆదుకోవడానికి ముందుకువస్తున్నాయి. వరదల కారణంగా సర్వం కోల్పోయిన వారికి ఆహార పొట్లాలు, నీళ్లు అందిస్తున్నాయి.
    Published by:Srinivas Munigala
    First published: