కరీంనగర్ జిల్లా తహసీల్దార్ ఆఫీసులో కలకలం, పెట్రోల్ డబ్బాతో తండ్రీకూతుళ్లు

తహసీల్దార్ ఆఫీసులో పెట్రోల్ బాటిత్‌తో తండ్రీకూతుళ్లు

Father and daughter suicide attempt | తమ పొలాన్ని వేరే వారి పేరుతో రిజిస్టర్ చేశారంటూ తండ్రీకూతుళ్లు ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు.

 • Share this:
  కరీంనగర్ జిల్లా కోహెడ మండలం చెంచలచెరువులపల్లి గ్రామానికి చెందిన భీంరెడ్డి తిరుపతి రెడ్డి, అతని కుమార్తె స్వరూప తమ భూమి వేరే వాళ్ళకి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని, సంవత్సరాల నుంచి ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, కోహెడ తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని పెట్రోల్ డబ్బాలతో అత్మహత్య చేసుకుంటామని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలు స్వరూప మాట్లాడుతూ తన తండ్రి తిరుపతి రెడ్డికి చెందిన ఎకరం 30 గుంటల భూమిని తన పేరుమీద 2011 లో రిజిస్ట్రేషన్ చేయించారని అప్పటినుండి మ్యుటేషన్ చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ మధ్యకాలంలో పహాణీలో తన తండ్రి పేరును తొలగించి వేరే వాళ్ల పేరు మీద భూమిని నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న తహసీల్దార్, ఇప్పుడున్న తహసీల్దార్ భూమి మోక మీదకి వచ్చి తనిఖీ చేసి హద్దులు నిర్ణయించి భూమి మా పేరు మీదనే చేస్తామని చెబుతున్నారు కానీ చేయడం లేదని వాపోయారు. వేరే వ్యక్తి తమ భూమిలో గత కొన్ని రోజులుగా దున్నతున్నాడని, పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు సైతం తమను తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంతవరకు తహసీల్దార్ కార్యాలయంలోనే ఉంటామని లేకుంటే కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. విషయం తెలుసుకొని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న స్థానిక తహసీల్దార్ పోలీసులు బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

  ఎమ్మార్వో ఆఫీసుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే వాదన చాలా కాలం నుంచి ఉంది. ఒకరి పేరుతో ఉన్న భూములను మరొకరి పేరుతో రిజిస్టర్ చేయడం, అసలు ఓనర్లు వాటిని మార్చాలంటూ ఆఫీసుల చుట్టూ తిరగడం లాంటి పరిపాటిగా మారుతున్నాయి. గతంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఓ తహసీల్దార్ ఆఫీసులో ఏకంగా ఓ వ్యక్తి ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత కూడా అలాగే కొందరు పెట్రోల్ బాటిల్ తీసుకెళ్లారు. దీనిపై రెవిన్యూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.

  కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని కీసర ఎమ్మార్వో నాగరాజు ఏకంగా రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 15 ఎకరాల భూమికి సంబంధించి ఉన్న సమస్యలను క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేయగా, ఆ డబ్బులను రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి తీసుకుంటూ దొరికిపోయారు. ఓ ఎమ్మార్వో ఈ స్థాయిలో డబ్బులు తీసుకుంటూ పట్టుబడడం తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడా జరిగిన ఘటనలు లేవు. దీంతో ఈ కేసు సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: