తెలంగాణలో కొద్దిరోజుల నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ అవుతోంది. తాజాగా ఐదు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు(Farmers) మంగళవారం నుంచి రైతుబంధు (RythuBandhu) నగదు జమ కాబోతోంది. నాలుగు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న 51.99 లక్షల మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఇప్పటివరకు రూ.3,946 కోట్లు పంపిణీ చేసింది. వానాకాలం పంటల్లో బిజీ అయిపోయిన రైతులకు కొద్దిరోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పటిలాగే తొలిరోజు ఎకరం భూమి ఉన్న రైతులకు పెట్టుబడి పైసలు పడనున్నాయి. తర్వాత క్రమపద్ధతిలో రైతులందరికీ జమ చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా 3.64 లక్షల మంది రైతులకు కూడా రైతుబంధు సాయం అందనున్నది. గత సీజన్‌తో పోల్చితే లబ్ధిదారులైన రైతుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఈ వానకాలం సీజన్‌కు రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా ప్రభుత్వం లెక్కతేల్చింది.
ఈ సీజన్లో రైతుబంధు పంపిణీ కోసం రూ.7,654.43 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ తెలిపింది. 1.53 కోట్ల ఎకరాలకు ప్రభుత్వం రైతుబంధు జమ చేయనున్నది. తొలిరోజు ఎకరం భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు రూ.586.65 కోట్లు ఖాతాల్లో జమవుతాయి.తెలంగాణ రైతు బంధు ఇప్పటి వరకు 8 విడతల్లో అందగా, తాజాగా 9వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
గత సీజన్ వరకు రికార్డు స్థాయిలో రైతుబంధు కింద రూ. 50,448 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఈ సీజన్లో పంపిణీ చేయబోయే రూ. 7,654.43 కోట్లతో కలిపితే ఇప్పటివరకు అందించిన సాయం రూ. 58,102 కోట్లకు చేరనున్నది. భూముల క్రయవిక్రయాలు, బదలాయింపు, కోర్టు కేసుల పరిష్కారాలు, వివాదంలోని పార్ట్-బీ జాబితాలోని భూ సమస్యల పరిష్కారం వంటి కారణాలతో రైతుల సంఖ్యతో పాటు భూమి కూడా పెరిగింది.
గత యాసంగిలో సుమారు 63 లక్షల మంది రైతులకు చెందిన 1.48 కోట్ల ఎకరాలకు రూ.7,411.52 కోట్లు అందింది. ఇందులో 1.71 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతా వివరాలు అందుబాటులో లేవు. మరో 1.70 లక్షల మంది రైతులు రైతుబంధు నిధులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. 96 లక్షల ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ భూములకు కూడా రైతుబంధు సాయం అందనున్నది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.