Adilabad: రైతు కంట నీరు.. బ్యారేజీ కోసం భూములిస్తే.. పరిహారం అందక ఇబ్బందులు

రైతుల ఆందోళన

గత మూడేళ్ళుగా నష్టపరిహారం ఇస్తామని చెపుతున్నారే తప్ప తమ వైపు చూసేవారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు, నాయకులకు పరిహారంపై గోడు వెళ్లబోసుకున్నా లాభం లేకుండా పోయిందని, అందుకే పనులు నిలిపివేసి ఇక్కడే మకాం వేస్తున్నామని చెప్పారు.

 • Share this:
  బ్యారేజీ కోసం ఆ రైతులంతా ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా అటు బ్యారేజీ పూర్తి కావడం లేదు. ఇటు పరిహారమూ రావడం లేదు. చేసుకోవడానికి పనుల్లేక బాధితులంతా ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్ మట్ బ్యారేజ్‌ వద్ద భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. భూమిని కోల్పోయిన వారికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పనులు జరుగుతున్న చోటికి వచ్చి రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన ఆరవ రోజుకు చేరుకుంది. వంటా వార్పు, జలదీక్ష వంటి వినూత్న కార్యక్రమాలతో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ రోజు మండల తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి వినతి పత్రం అందజేశారు.

  నిర్మల్ జిల్లాలో 18 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గోదావరి నదిపై సదర్ మాట్ బ్యారేజి నిర్మాణం చేపట్టింది. బ్యారేజీ నిర్మాణం కోసం 1176 ఎకరాల భూమిని సేకరించారు. పరిహారం కోసం సుమారు 111 కోట్లు కెటాయించారు. ఇందులో 673 ఎకరాలకు గాను 66.42 కోట్ల పరిహారం చెల్లించారు. కాగా 2016లో ప్రారంభమైన ఈ పనులు 2018లో పూర్తి కావాల్సి ఉండగా, ఇంకా పూర్తి కాలేదు. పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇదిలా ఉంటే పొన్కల్ గ్రామం వద్ద నిర్మిస్తున్న సదర్ మాట్ బ్యారేజి వద్ద భూములు కోల్పోయి ఇంకా పరిహారం అందని బాధితులు తమ ఆందోళనకు తెరలేపారు.

  గత మూడేళ్ళుగా నష్టపరిహారం ఇస్తామని చెపుతున్నారే తప్ప తమ వైపు చూసేవారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు, నాయకులకు పరిహారంపై గోడు వెళ్లబోసుకున్నా లాభం లేకుండా పోయిందని, అందుకే పనులు నిలిపివేసి ఇక్కడే మకాం వేస్తున్నామని చెప్పారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారు ముందుగా పరిహారం తీసుకుని చిన్న సన్నకారు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. భూములు కోల్పోవడంతో పనులు లేక విల విలలాడుతున్నామని కంటతడి పెడుతున్నారు. పరిహారం వచ్చేవరకు బ్యారేజీ నిర్మాణం వద్దనే ఉంటామని, పరిహారం ఇచ్చాకే పనులు జరపాలని రైతులు తేల్చి చెబుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: