హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad: ఈ పంటతో రైతులకు భారీగా ఆదాయం.. ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న సాగు

Adilabad: ఈ పంటతో రైతులకు భారీగా ఆదాయం.. ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న సాగు

ఆయిల్ పామ్ మొక్కలు

ఆయిల్ పామ్ మొక్కలు

Adilabad: వరుస నష్టాల నుండి బయట పడి మంచి ఆదాయం పొందడం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు కొత్త పంటను ఎంచుకున్నారు. ప్రభుత్వ సాయంతో ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Adilabad

(కట్ట లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)

ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతలకు ప్రతియేటా సాగు కష్టాలు తప్పడం లేదు. పంట పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నా దిగుబడిపై నమ్మకం లేని పరిస్థితి. వాతావరణం అనుకూలించక ఒకసారి, మొలకెత్తని విత్తనాలతో మరోసారి వరుస నష్టాలను చవిచూస్తున్న రైతులు ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. అధిక ఆదాయాన్నిచే ప్రత్యామ్నాయ పంటల సాగువైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా రైతుల సాగు కష్టాలను తొలగించాలని, వారికి కొంత లాభం చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో పలు ప్రోత్సహకాలను కూడా అందిస్తోంది. ఇందులోభాగంగానే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్  సాగును ప్రోత్సహిస్తూ రైతులకు అవగాహన కల్పించేందుకు పలు చర్యలు కూడా తీసుకుంటోంది. తక్కువ పెట్టుబడి అవసరమవడం, లాభాదాయకం కూడా కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని రైతులు ఆయిల్ పామ్ సాగు (Oil Palm Farming) దిశగా అడుగులు వేస్తున్నారు.

జిల్లాలోని నేలలు కూడా ఈ ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం కావడం వారికి మరింత కలిసివస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కొందరు రైతులు ప్రధాన పంటగా సాగు చేస్తే, మరికొందరు రైతులు అంతర పంటగా సాగుచేస్తున్నారు. జిల్లాలో రైతులు సాగుచేస్తున్న సంప్రదాయ పంటలు, పత్తి, సోయాబీన్, కంది తదితర పంటలకు అధిక వ్యయం కావడం,   దిగుబడులు తగ్గడం, కూలీల కొరత వేధించడంతో  జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే ఆయిల్ పాం సాగుపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించడమేకాకుండా పంట సాగుకు అవసరమైన డ్రిప్ ఏర్పాటు, మొక్కలకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం రాయితీల రూపంలో అందిస్తుండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వచ్చే సంవత్సరం మార్చి నెల నాటి కనీసం 16,890 ఎకరాల్లో ఈ ఆయిల్ పామ్ పంట సాగయ్యేలా ప్రభుత్వం జిల్లాకు లక్ష్యాన్ని కూడా నిర్దేశించింది. ఇందులో ఎక్కువ లక్ష్యం నిర్మల్ జిల్లాకు కేటాయించారు.

నిర్మల్ జిల్లాకు 15000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని,  ఇప్పటి వరకు  1856  ఎకరాలలో  ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగిందని ఆ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలను రైతులకు అందించాలనే ఉద్దేశంతో జిల్లాలోని సారంగపూర్ మండలం బీరవెల్లిలో  90 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ నర్సరీని ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాకు సరిపడా మూడున్నర లక్షల మొక్కలు నర్సరీలో  అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 3,400 ఎకరాల సాగు లక్ష్యం కాగా 381 మంది రైతులు 1,501 ఎకరాలలో నాటారు. మంచిర్యాల జిల్లాలో 2,442 ఎకరాల సాగు లక్ష్యం కాగా 150 మంది రైతులు 540 ఎకరాలలో, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,048 ఎకరాల లక్ష్యానికి 112 ఎకరాల్లో 54 మంది రైతులు సాగుచేస్తున్నారు.

ఆయిల్ పామ్‌ పంటను అంతర పంటగా సాగు చేయవచ్చని, ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని, ఒకసారి పంట కాతకు వచ్చిందంటే రైతులకు లాభదాయకమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అటు అధిక డిమాండ్ ఉన్న ఈ ఆయిల్ పాం పంట భవిష్యత్తులో తమకు లాభాలు తెచ్చిపెడుతుందని జిల్లా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Adilabad, Agriculture, Farmers, Telangana

ఉత్తమ కథలు