Home /News /telangana /

FARMERS ARE FACING SEVERE DIFFICULTIES WITH THE CLOSURE OF THE KHAMMAM MIRCHI MARKET AS PART OF PRECAUTIONARY MEASURES AGAINST THE CORONA VIRUS VB KMM

Mirchi market: కరోనాలో మిర్చి రైతు కష్టాలు.. గోడౌన్లలో ఖాళీల్లేవ్‌.. పంట వచ్చినా కొనుగోళ్లు లేవ్..

మిర్చి రూ.7000 (క్వింటాల్)

మిర్చి రూ.7000 (క్వింటాల్)

Mirchi market: ఆరుగాలం శ్రమించి.. పండించి.. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య చేతికొచ్చిన పంటను సకాలంలో అమ్ముకోలేని దైన్యం ఇప్పుడు రైతులది. కరోనా వైరస్‌ ఉధృతి నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఖమ్మం మిర్చి మార్కెట్‌ మూసివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇంకా చదవండి ...
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా , న్యూస్‌18 తెలుగు)

  ఒక వైపు పొలాల్లోనూ, కళ్లాల్లోనూ ఉన్న కొంత పంట అకాల వర్షాలకు తడుస్తున్న దీనస్థితి ఉండగా.. మరోవైపు ఏసీ గోడౌన్లు నిండిపోయి పంటను దాచి పెట్టాలన్నా వీలులేని దుస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌ ఎప్పుడు తెరుస్తారు..? కొనుగోళ్లు ఎన్నడు మొదలు పెడతారన్న విషయాలపై ఎవరికీ స్పష్టత లేని పరిస్థితి. వాస్తవానికి కోవిడ్‌-19 కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినా.. సాగు సంబంధిత విషయాల్లో ఎక్కడా ఎలాంటి ఆంక్షలు విధించలేదు. పంట చేతికొచ్చే కాలం కావడంతో మార్కెట్‌ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ కొనుగోళ్లు జరపాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా కోవిడ్‌ ధాటికి భయానికి లోనైన వ్యాపారులు, ట్రేడర్లు, హమాలీలు కొద్ది రోజులు క్రయవిక్రయాలను నిలిపేశారు. దీంతో ఖమ్మం మార్కెట్‌ మూతపడింది. గత రెండు వారాలుగా మార్కెట్‌లో కొనుగోళ్లు లేని దుస్థితి. దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  ఖమ్మం.. మిర్చికి గుమ్మం..
  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఖమ్మం అతి పెద్ద రెండో మిర్చి మార్కెట్‌గా పేరుంది. గుంటూరు మార్కెట్‌ తర్వాత ఇక్కడే అత్యధిక స్థాయిలో పంట ఉత్పత్తి, కొనుగోళ్లు, ఎగుమతులు జరుగుతుంటాయి. దీంతో ఖమ్మం మిర్చి మార్కెట్‌కు స్థానికంగా జిల్లాలోని రైతులతో బాటు, మహబూబాబాద్‌, సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, కృష్ణా జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే గడచిన పంట కాలంలో సుమారుగా అరవై వేల ఎకరాల్లో మిర్చి పంట పండింది. ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా మార్కెట్‌కు రాగా.. మిగిలిన ముప్పై శాతం పంట ఇంకా రైతుల వద్దే ఉంది. కొందరికి కూలీలు దొరక్క ఆలస్యంగా చివరి రెండు కోతలు కోయడం.. కళ్లాల్లో ఎండపోయడం.. ఊళ్లలో అందుబాటులో ఉన్న చోట్ల నిల్వ పెట్టడం లాంటివి కనిపిస్తున్నాయి. దీనికితోడు ఇప్పటికే మార్కెట్‌కు వచ్చిన పంటను అమ్ముకోడానికి అనువైన ధరలు లేవు. గత నెలలో క్వింటాకు రూ.15000 పైగా ధర పలకగా.. ఇప్పుడు అది రూ.8000ల దాకా పడింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో నిల్వ ఉంచడానికి ప్రయత్నిస్తే.. అక్కడా అదే పరిస్థితి.

  ఖమ్మం పట్టణం, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం నలభై ఏసీ గోదాములు ఉండగా.. వాటిలో 38.33 లక్షల మిర్చి బస్తాలు పట్టే పరిస్థితి. ఇప్పటికే 36 లక్షల బస్తాల మేర మిర్చి గోడౌన్లకు చేరగా, ఇంకా కేవలం రెండు లక్షలకు పైగా బస్తాలు మాత్రమే పెట్టగలిగే పరిస్థితి. దీంతో ఏసీ గోడౌన్లలో పెట్టాలన్నా రికమండేషన్లు చేయించాల్సిన దుస్థితి.. దీనికి తోడు గతంలో బస్తాకు సీజన్‌కు రూ.150 నుంచి 180 దాకా తీసుకునేవాళ్లు కాస్తా.. డిమాండ్‌ను బట్టి రేట్లు పెంచేశారు. ఇది ఇప్పుడు రూ.200 నుంచి 250 దాకా ఉంది. అయినా ఖాళీలు లేవు. దీంతో మార్కెట్‌ రేటు కన్నా ఎంతో కొంత తక్కువకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఉంది. రైతు అవసరాలను కొందరు వ్యాపారులు అనువుగా మార్చుకుంటున్న దైన్యం నెలకొంది. దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఈ సీజన్‌లో కాస్త పెరిగినట్టు విమర్శలు వస్తున్నాయి. ఈనెల రెండో తేదీన మార్కెట్‌ మూతపడేదాకా ఈ సీజన్‌కు సంబంధించిన సరకు లక్ష మెట్రిక్‌ టన్నుల మేర కొనుగోళ్లు జరిగినట్టు చెబుతున్నారు. అయినా ఇంకా దానికి ఒకటిన్నర రెట్లు మేర సరకు గోడౌన్లలోనూ.. మరో ఏభై వేల క్వింటాళ్ల దాకా రైతుల వద్ద ఉన్నట్టు అంచనా.

  సరైన కాలంలో మిర్చి పంటను అమ్ముకోవడం లేదంటే ఏసీ గోడౌన్లలో నిల్వ ఉంచడం.. దీనికి మించిన పరిష్కారం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ నిల్వలు పెడితే రంగు మారి నాణ్యతను కోల్పోతుంది. రేటు కూడా పడిపోతుంది. దీంతో మిర్చి పంటను ఎంత త్వరగా అమ్ముకోగలిగితే అంత మంచిదన్నది రైతుల అభిప్రాయం. ఎవరైనా ఆర్థికంగా వెసులుబాటు ఉన్న రైతులు ఏసీ గోడౌన్లలో నిల్వ పెట్టినా నమ్మకమైన రేటు గ్యారెంటీ లేదు. దీంతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి.. కూలీల కొరతతో ఇబ్బందులు పడుతూ .. వడ్డీలపై వడ్డీలు చెల్లిస్తూ ఎప్పటికప్పుడు ఆశతో జీవిస్తున్న రైతుకు ఈ ఏడాదైనా అనుకూలంగా ఉంటుందా అంటే ప్రశ్నగానే మిగిలుతోంది. అవసరమైనన్ని గోడౌన్లను అందుబాటులోకి తేవడం ఒక పరిష్కారం కాగా.. కొనుగోళ్లను వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం కూడా ఉందన్నది రైతు ప్రతినిధుల డిమాండ్‌. ఈ పరిస్థితులపై ఖమ్మం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ చిన్ని కృష్ణారావు 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా మార్కెట్‌ను అందుబాటులోకి తేవడానికి అందరితో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఒకరిద్దరు వ్యాపారులు, మరికొందరు హమాలీలు కోవిడ్‌ బారిన పడి చనిపోయవడంతో అందరూ భయానికి లోనయ్యారని, అందరిలోనూ పాజిటివ్‌ ధోరణిలో నమ్మకం పెంచే దిశగా సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. మరో వారంలో మార్కెట్‌లో కొనుగోళ్లు మొదలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Corona lockdown, Farmers, Khammam, Mirchi market

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు