కొద్దిరోజుల ముందు వరకు ధాన్యం కొనుగోలు చేస్తారో చేయారో అనే ఆందోళనలో ఉన్న రైతులకు సీఎం కేసీఆర్ కొనుగోళ్లు చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆనందం వెల్లివిరిసిన సంగతి తెలిసిందే. కానీ ఇపుడు రైతులు మళ్లీ ఆందోళనలో ఉన్నారు.
యాసంగి వరి ధాన్యం పండించిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. కొద్దిరోజుల ముందు వరకు ధాన్యం కొనుగోలు (Grain purchase) చేస్తారో చేయారో అనే ఆందోళనలో ఉన్న రైతులకు సీఎం కేసీఆర్ (CM KCR) కొనుగోళ్లు చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆనందం వెల్లివిరిసిన సంగతి తెలిసిందే. కానీ ఇపుడు రైతులు మళ్లీ ఆందోళనలో ఉన్నారు. 45 రోజులుగా వరి ధాన్యం రోడ్లపై.. కల్లాలలో పోసి రైతులు కళ్లలో ఒత్తులు వెసుకుని చూస్తున్నారు. కానీ కొనుగోళ్లు మాత్రం ముందుకు సాగడం లేదు. ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు ఆడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. నాయకులు.. అధికారులు చెబుతున్న రైస్ మిల్లర్లు మాత్రం ధాన్యం (Grains) తీసుకునేందుకు ససేమీరా అంటున్నారు.. ఎలాగైనా వరి ధాన్యం కోనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు (farmers) కోరుతున్నారు.
గ్రామం నుంచి పది లారీలైనా పోలేదే..?
నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో ఈ యేడు యాసంగిలో 3 లక్షల 46 వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. 9.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశామన్నారు. అయితే ఇందులో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు గాను జిల్లా వ్యాప్తంగా 458 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేవారు.. ఇదంతా బాగానే ఉంది. కానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయి నెల రోజులు గడుస్తున్నా ఒక గ్రామం నుంచి పది లారీ ధాన్యం కూడా పోయిన పాపాన పోలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర్పల్లి మండలంలో రైతులు కలెక్టరేట్ వద్ద ధర్న చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదు లారీలు మాత్రమే వెళ్లాయని వారు అన్నారు. మొత్తం కొనుగోళ్ళు జరగాలాంటే మరో రెండు నెలలు పట్టేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దొడ్డు రకం ధాన్యంపైనే..
ఎమ్మెల్యే (MLA)కు చెప్పిన మా సమస్య పరిష్కారం కావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కొనుగోలు కేంద్రాల ద్వారా లారీలలో పంపిన ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ (Collector) సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి దొడ్డు రకం ధాన్యం అన్లోడ్ చేయడంలో అలసత్వం వహించే మిల్లులను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడవద్దని తేల్చి చెప్పారు. శుక్రవారం సాయంత్రం వరి ధాన్యం సేకరణ పై అధికారులతో (Officials)సమీక్ష జరిపారు కలెక్టర్.
కొన్ని రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలతో ఉన్న లారీలను సకాలంలో అన్లోడ్ చేయకుండా అలాగే నిలిపివేస్తుండడం వల్ల కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ధాన్యం సేకరణ పైనా దీని ప్రభావం పడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం నిల్వలను ఏ రోజుకు ఆ రోజే రైస్ మిల్లుల వద్ద దించుకునేలా చూడాలన్నారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని తహసీల్దార్లను ఆదేశించారు.
గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలి..
ధాన్యం రవాణా (Grains transport) కోసం 1600 వాహనాలు అనునిత్యం తిరగాల్సిందే అన్నారు. ఏ ఒక్క వాహనం రాకపోయినా సంబంధిత కాంట్రాక్టరుకు జరిమానా విధించాలని పౌర సరఫరాల సంస్థ అధికారి అభిషేక్ ను ఆదేశించారు. ఇంకను ధాన్యం తరలింపు కోసం అదనంగా వాహనాలు అవసరమైతే సమకూర్చుకోవాలని, దీనికి పోలీస్ శాఖ కూడా సహకరిస్తుందని తహసీల్దార్లకు కలెక్టర్ సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి వెంటవెంటనే బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు . ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తూ, గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైస్ మిల్లులకు సమాన నిష్పత్తిలో దొడ్డు, సన్న రకం ధాన్యం నిల్వలు పంపించాలని డీ ఎస్ ఓ కు సూచించారు.
ధాన్యాన్ని వద్దనడానికి కారణం ఇదేనా..
ఒక క్వింటాలు వరి ధాన్యం నుంచి 58 నుంచి 59 కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయి. అందులో 50 శాతం నూకా.. 50 శాతం నాణ్యమైన బియ్యం వస్తుంది. దీంతో రైస్ మిల్లర్లు వరి ధాన్యం తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు.. అయితే రైస్ మిల్లు వద్ద లారీలు క్యూ కడుతున్నాయి. అయినా ఆన్ లోడ్ చేసుకోవడానికి రైస్ మిల్లు సుముఖంగా లేరు. ఎందుకు లేరు అనే విషయాన్ని ఆరా తీయగా యాసంగి వడ్ల లో 50 శాతం నూక.. 50 శాతం బియ్యం వస్తుందనే విషయం తెలిసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. తరుగును ప్రభుత్వం రైతుల కోసం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ రైస్ మిల్లర్లకు మాత్రం స్పష్టమైన ఆదేశాలు లేవు. దీంతో 50 శాతం బియ్యాన్ని ఎక్కడి నుంచి తేవాలి ఆనేది రైస్ మిల్లర్ల వాదన. దీంతో అధికార పార్టీ నాయకులు, అధికారులు రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకొవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ 50 శాతం నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుందని రాత పూర్వకంగా రాసి ఇస్తే దొడ్డు రకం వరి ధాన్యాన్ని దించుకునేదుకు ఎలాంటి అభ్యంతరం లేదని రైస్ మిల్లర్లు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటి ఇచ్చేంత వరకు రైతులకు కష్టాలు తప్పేలా లేవు.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది..
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.