Mobile Rice Mill: రైతు దగ్గరికే రైస్ మిల్లు.. యూట్యూబ్‌లో వెతికి మరీ..

మొబైల్ రైస్ మిల్లు

Mobile Rice Mill: స్వతహాగా రైతు అయిన లచ్చయ్య.. సాటి రైతుల కోసం ఏం చేయగలనో ఆలోచించాడు. యూట్యూబ్ ద్వారా వెతికి మొబైల్ రైస్ మిల్లును అందుబాటులోకి తీసుకువచ్చాడు.

 • Share this:
  ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన వడ్లను బియ్యంగా మార్చాలంటే ఎన్నో వ్యయప్రయాసాలకోర్చుకోవాలి. అలాంటి పనిని తక్కువ శ్రమ, ఖర్చుతో రైతు ముంగిటే చేస్తే ఆ రైతు ఎంతో సంతోషిస్తాడు. సరిగ్గా అదే పని చేయాలని ఆలోంచిన ఓ రైతు దాన్ని ఆచరణలో పెట్టాడు. అది సంచార రైస్ మిల్లు రూపంలో. రైతుల కల్లాల వద్దకే వెళ్ళి వడ్ల మరపట్టి బియ్యంగా మార్చి ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వడ్లను మిల్లుకు తరలించేందుకు పడే కష్టాలు తప్పడం, ఖర్చులు కలిసి రావడంతో రైతులు ఈ సంచార అదే మొబైల్ రైస్ మిల్లు వైపు ఆసక్తి చూపుతున్నారు. అసలు విషయానికి వస్తె మంచిర్యాల జిల్లా హజీపూర్ గ్రామానికి చెందిన పార్వతి లచ్చయ్య అనే రైతు ఈ మొబైల్ రైస్ మిల్లును తీసుకువచ్చాడు. వరి పండిస్తున్నరైతులు వడ్లను మరపట్టించి బియ్యంగా మార్చుకోవానికి పడుతున్న కష్టాలను తొలగించాలనుకున్నాడు.

  స్వతహాగా రైతు అయిన ఆయన అందుకు ఏం చేయగలనో ఆలోచించాడు. యూట్యూబ్ ద్వారా వెతికి మొబైల్ రైస్ మిల్లును అందుబాటులోకి తీసుకువచ్చాడు. అందుకోసం తనకున్నపాత ట్రాక్టర్ ను అమ్మేశాడు. కొత్త ట్రాక్టర్ తీసుకొని బీహార్ నుండి ఐదున్నర లక్షలకు ఈ మొబైల్ రైస్ మిల్లు కొనుగోలు చేసి, అక్కడే కొంత శిక్షణ కూడా పొంది దాన్ని ఇక్కడికి తీసుకువచ్చారు. దీని కోసం ఆ రైతుకు సుమారు ఆరు లక్షల రూపాయలకు వరకు ఖర్చుచేశాడు. 45 నుండి 60 హెచ్ పి సామర్థ్యం కలిగిన ట్రాక్టర్ ఇంజన్ సహాయంతో ఈ మొబైల్ రైస్ మిల్లు పనిచేస్తుంది.

  గంటకు ఐదు లీటర్ల డిజిల్ ఖర్చవుతుండగా, ఎనిమిది నుండి పది క్వింటాల్ల వడ్లను పడుతున్నారు. దీంతో పాటు ఊక, తవుడు కూడా రైతులకు మిగులుతుండటం ఆర్థికంగా కొంతవరకు కలిసి వస్తోంది. ట్రాన్స్ పోర్ట్ ఖర్చు, శారీరక శ్రమ తప్పుతుండటంతో రైతులు ఈ మొబైల్ రైస్ మిల్లు వైపే మొగ్గుచూపుతున్నారు. రైతులు సమాచారం ఇచ్చిన వెంటనే వారి కల్లాల వద్దకే వెళ్ళి వడ్లను మరపడుతుండతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వినని, చూడని ఈ మొబైల్ రైస్ మిల్లును చూసేందుకు ఇరుగు పొరుగు జిల్లాల నుండి రైతులు హజీపూర్ కు వస్తున్నారు. ఏదిఏమైనా ఓ రైతు తన తోటి రైతుల కష్టాలను కొంతవరకైనా తొలగించాలన్న తపనతో అటు ప్రభుత్వం గాని, ఇటు ఇతరుల సహాకారం గాని లేకుండానే స్వతహాగా సరికొత్త మొబైల్ రైస్ మిల్లు ను అందబాటులోకి తీసుకురావడం అభినందనీయమని చెప్పాలి.
  Published by:Kishore Akkaladevi
  First published: