(P.Srinivas,New18,Karimnagar)
ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందనే రోజులు మళ్లీ వస్తున్నాయి. అమ్మాయిల పట్ల వివక్ష, ఆడపిల్లల పట్ల పక్షపాతం చూపించే రోజుల నుంచి జనం మారిపోతున్నారు. ఆడపిల్లలే ఇంటికి ఐశ్వర్యం, అదృష్టం, అన్నీ అనే విధంగా జనంలో మార్పు వస్తోంది. జగిత్యాల(Jagityala)జిల్లాలో ఓ ఆడపిల్లను కన్న తల్లికి మెట్టినింట్లో లభించిన ఆదరణ, అత్తమామలు, భర్త ఆమెకు గ్రాండ్‌గా స్వాగతం( Grand Welcome) పలికిన తీరు ఇప్పుడు అందరికి స్పూర్తినిస్తోంది. కోడలు కొడుకుని కంటే సంబరపడే అత్తమామలు, ఆడపిల్లకు జన్మనిచ్చి ఇంటికి తెస్తోందని తెలిసి పండుగ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్(Vidyanagar)లో ఈ వేడుక అందర్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియా(Social media)లో తెగ చక్కర్లు కొడుతోంది.
పసిపాపకు గ్రాండ్ వెల్కమ్..
రాహుల్ - సుప్రియ దంపతులకు మొదటి కాన్పులోనే ఆడపిల్ల పుట్టింది. ఈ విషయం తెలుసుకున్న మెట్టినింటి వాళ్లు సంబరపడిపోయారు. సాక్షాత్తు తమ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందంటూ ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. సుప్రియ పుట్టించి నుంచి పాపతో జగిత్యాలలోని అత్తవారింటికి రావడంతో అపూర్వ స్వాగతం పలికారు. ఇల్లంతా పూలతో అలంకరించారు. దారి పొడవున తివాచీ బదులు పూలదారి పేర్చారు కుటుంబసభ్యులు. పాప ఇంటికి రాగానే టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇంట్లో 8 రూపాల్లో అమ్మవారి ప్రతిమల్ని ఏర్పాటు చేశారు. తల్లి, బిడ్డకు ఇంట్లోని ఆడపడుచు, అత్త హారచిచ్చి పాపను ఆహ్వానించారు. ఆడపిల్ల జన్మించటంతో ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ పాపకు మహాలక్ష్మి అనే పేరు పెట్టారు కుటుంబ సభ్యులు.
ఆడపిల్లకు దక్కిన గౌరవం..
తల్లి కడుపులోనే ఆడో, మగో తెలుసుకునే దుర్మార్గులు ఉన్న ఈరోజుల్లో ..కోడలు ఆడపిల్లను ప్రసవించిందని తెలిసి ఈ విధంగా సంబరాలు చేయడం, స్వాగతాలు పలకడంపై స్థానికులతో పాటు రాహుల్, సుప్రియ బంధు,మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీతో పాటు మనిషి ఆలోచన విధానం కూడా మారాలని ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. కడుపున పుట్టిన బిడ్డలను ఆడ,మగా అనే తేడా చూపిస్తూ లింగవివక్షకు గురి చేయడం మానుకోవాలంటున్నారు. ఆడపిల్లగా పుట్టగానే అపూర్వస్వాగతం అందుకొని మహాలక్ష్మి పేరు పెట్టించుకున్న పసిబిడ్డ జీవితంలో సుఖ, సంతోషాలతో గడుపాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jagityala, Telangana, Viral Videos